గ్రేట్ వాల్... గ్రేట్ బ్రిడ్జ్... ఇప్పుడు గ్రేట్ బిల్డింగ్! | Now, Great Building of constructed as Great Wall | Sakshi
Sakshi News home page

గ్రేట్ వాల్... గ్రేట్ బ్రిడ్జ్... ఇప్పుడు గ్రేట్ బిల్డింగ్!

Oct 2 2016 2:49 AM | Updated on Sep 4 2017 3:48 PM

రికార్డుల కోసమో, ఇంకో ఉద్దేశంతోనో తెలియదుగానీ... ప్రపంచంలో ఎత్తై ఆకాశహర్శ్వాల నిర్మాణం ఏటికేడాదీ జోరందుకుంటోంది.

రికార్డుల కోసమో, ఇంకో ఉద్దేశంతోనో తెలియదుగానీ... ప్రపంచంలో ఎత్తై ఆకాశహర్శ్వాల నిర్మాణం ఏటికేడాదీ జోరందుకుంటోంది. నిన్నమొన్నటి దాకా దుబాయిలోని బుర్జ్ ఖలీఫా ఓ అద్భుతం అనుకుంటూ ఉంటే, దాన్ని తలదన్నే రీతిలో సౌదీ అరేబియాలో దాదాపు కిలోమీటర్ ఎత్తున్న జెడ్డా టవర్స్ నిర్మాణం పూర్తిస్థాయిలో జరుగుతోంది. ఇప్పుడిక చైనా.. ‘మేమేం తక్కువ తినలేదు’ అన్నట్టుగా రంగంలోకి దిగింది. హాంకాంగ్-షెన్‌జెన్ మార్గంలోని లౌహౌ జిల్లాలో ఓ భారీ స్కైస్క్రాపర్ నిర్మాణానికి  చైనా సిద్ధమవుతోంది.
 
‘హెచ్700 షెన్‌జెన్’ అని పిలుస్తున్న ఈ బిల్డింగ్ ఎత్తు దాదాపు 739 మీటర్లు. అంటే ముప్పాతిక కిలోమీటర్‌కు కొంచెం తక్కువన్నమాట! ఫొటోలో కనిపిస్తున్నవి ఆ బిల్డింగ్ నమూనాలే. నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే మూడో ఎత్తై భవనంగా రికార్డు సృష్టిస్తుంది. అయితే ఇదొక్కటే దీని ప్రత్యేకత కాదు. అంతెత్తుమీద ఓపెన్ టాప్ ఉద్యానవనం ఒకటి పచ్చదనాన్ని పంచుతుంది.

భవనం మధ్యభాగంలో కొన్ని అంతస్తుల ఎత్తు వరకూ ఏర్పాటు చేసే ఈ స్కైగార్డెన్ ఈ భవనానికి ఓ హైలెట్ అంటోంది ఆర్కిటెక్చర్ సంస్థ బీకేఎల్.  ఇప్పటికే ఎత్తై బ్రిడ్జీల నిర్మాణంలో రికార్డులు సృష్టిస్తున్న చైనా ఈ బిల్డింగ్‌లోనూ ఓ బ్రిడ్జీని నిర్మిస్తోంది. ఇది హెచ్700 షెన్‌జెన్ పక్కనే నిర్మాణమవుతున్న 680 మీటర్ల ఎత్తై భవనాన్ని కలుపుతుంది. హెచ్700 షెన్‌జెన్ నిర్మాణ అనుమతుల కోసం బీకేఎల్ ఆర్కిటెక్చర్  స్థానిక ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించింది.

Advertisement
Advertisement