న్యూజిలాండ్‌లో కరోనా జీరో

New Zealand drops Covid-19 restrictions after nation declared virus-free - Sakshi

వైరస్‌ను అణిచివేశామన్న ప్రధాని

తాత్కాలికంగానైనా జయించాం

వెల్లింగ్టన్‌: ప్రపంచమంతా కోవిడ్‌ కోరల్లో విలవిల్లాడుతోంటే న్యూజిలాండ్‌ మాత్రం కోవిడ్‌ను జయించినట్టు ఆ దేశం ప్రకటించింది. కనీసం తాత్కాలికంగానైనా న్యూజిలాండ్‌ కోవిడ్‌ మహమ్మారిని అరికట్టగలగడంతో ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చిట్టచివరి కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తికూడా కోలుకున్నట్టు వైద్య అధికారులు సోమవారం ప్రకటించారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ జీరో అయింది. గత పదిహేడు రోజులుగా 40,000 మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

50 లక్షల జనాభాగలిగిన న్యూజిలాండ్‌లో మొత్తం 3లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి చివరినుంచి చూస్తే సోమవారం న్యూజిలాండ్‌లో ఒక్క యాక్టివ్‌ కేసుకూడా లేదని ప్రధాని ప్రకటించారు. ‘‘కరోనాను కట్టడిచేశామన్న వార్త వినగానే నేను నా కూతురు నేవ్‌ ఎదుట డాన్స్‌ చేశాను’’ అని ప్రధాని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతానికైతే న్యూజిలాండ్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలిగింది. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇది నిరంతర ప్రక్రియ’ అని మీడియా సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించారు.

దేశంలో మళ్ళీ కేసులు బయటపడే అవకాశం కూడా లేకపోలేదనీ, అంత మాత్రాన మనం కరోనా కట్టడిలో విఫలమైనట్టు కాదనీ, అది వైరస్‌ వాస్తవికతగా  అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.  అర్థరాత్రి నుంచి దేశంలో కోవిడ్‌ ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తున్నట్టు ప్రధాని ఆర్డెర్న్‌ ప్రకటించారు. న్యూజిలాండ్‌ భౌగోళిక స్వరూపం రీత్యా ప్రత్యేకంగా ఉండడం వంటి అనేక కారణాల రీత్యా కరోనాని కట్టడిచేయగలిగారని నిపుణులంటున్నారు.  దేశంలో 1,500 మందికి కరోనా సోకగా, అందులో 22 మంది మరణించారు. వైరస్‌ని కట్టడిచేసినప్పటికీ  దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లోనే ఉంది.

పాక్‌ రాజకీయ నేతల్లో కరోనా కలకలం
పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి షాహిద్‌ ఖ్వాక్వాన్‌ అబ్బాసి, ప్రస్తుత రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌లకు జరిపిన ఆరోగ్య పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. పాకిస్తాన్‌లో మొత్తం లక్ష మందికి కరోనా వైరస్‌ సోకింది. రైల్వే శాఖా మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌కి కరోనా నిర్ధారణ అయ్యింది. నలుగురు చట్టసభ సభ్యులు కరోనాతో మృతి చెందారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top