ట్రంప్‌ ట్వీట్‌పై నెటిజన్ల మండిపాటు..  | Netizens Slams Donald Trump Over Copy Obama Tweet | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ట్వీట్‌పై నెటిజన్ల మండిపాటు.. 

Jan 27 2020 3:07 PM | Updated on Jan 27 2020 3:15 PM

Netizens Slams Donald Trump Over Copy Obama Tweet - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌, కోచ్‌ కోబ్‌ బ్రియాంట్‌, అతని కుమార్తె గియానా హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బ్రియాంట్‌, గియానా మృతిపై ప్రపంచంలోని పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేస్తున్నారు. బ్రియాంట్‌ మృతి పట్ల ట్రంప్‌తోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో బ్రియాంట్‌కు నివాళులర్పిస్తూ.. ట్రంప్‌ చేసిన ట్వీట్‌పై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

‘గొప్ప బాస్కెట్‌బాల్‌ ఆటగాళ్లలో బ్రియాంట్‌ ఒక్కరిగా నిలిచిపోతారు. బ్రియాంట్‌కు కుటుంబం అంటే చాలా ఇష్టం. భవిష్యత్తుపై అతనికి బలమైన నమ్మకం, ప్రేమ ఉండేది. బ్రియాంట్‌తో పాటు అతని కుమార్తె గియానా కూడా ఈ ప్రమాదంలో మరణించడం మరింత బాధను పెంచింది. మెలానియాతో పాటు నేను.. బ్రియాంట్‌ భార్య వెనెస్సాకు, అతని కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాం. దేవుడు వారితో ఉండాలని ఆశిస్తున్నాను’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అంతకుముందే ట్వీట్‌ చేసిన ఒబామా బ్రియాంట్‌ మృతికి నివాళులర్పిస్తూ ట్వీట్‌ చేశారు. అలాగే తన భార్య మిషెల్‌తోపాటు తన తరఫున వెనెస్సాతోపాటు బ్రియాంట్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

అయతే ట్రంప్‌ ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు.. ఒబామా, ట్రంప్‌ ట్వీట్‌ల మధ్య సారూప్యత ఉందని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కొద్దిపాటి మార్పులతో ఒబామా ట్వీట్‌ను ట్రంప్‌ కాపీ చేశారని ఆరోపిస్తున్నారు. ఒబామా చేసిన ట్వీట్‌కు సంబంధించిన స్ర్కీన్‌ షాట్‌లను షేర్‌ చేస్తూ ట్రంప్‌పై విమర్శలు చేస్తున్నారు. ‘మీరు ఎప్పటికీ ఒబామా  కాలేరు.. కనుక ఇలాంటి పనులను ఆపేయండి’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement