అంతరిక్ష పర్యాటకం; 2020 నుంచి ఐఎస్‌ఎస్‌ యాత్రలు!

NASA Says It Will Develop Space Tourism - Sakshi

న్యూయార్క్‌: అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు 2020నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నట్లు నాసా ప్రకటించింది. ఈ క్రమంలో 30 రోజుల పాటు ప్రైవేట్‌ వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టినట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా కక్షలో తిరుగుతున్న ఈ ఉపగ్రహంలో ఒక్క రాత్రి గడపాలనుకునే వారి నుంచి 35 వేల డాలర్లు(రూ.24 లక్షలు) చొప్పున వసూలు చేస్తామని తెలిపింది. మొత్తం రానుపోను చార్జీలతో కలిపి ఒక్కొక్కరికి రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని వివరించింది.

అంతరిక్ష కేంద్రం నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని నాసా భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఏడాదిలో రెండు సార్లు ప్రైవేట్‌ వ్యోమగాములను అనుమతించేందుకు అవకాశముందని నాసా అధికారులు తెలిపారు. ఈ పర్యటనలను ఏడాదికి 12 వరకు పెంచే అవకాశం ఉందన్నారు. కాగా అమెరికాకు చెందిన వ్యాపారవేత్త డెన్నిస్‌ టిటో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్లిన యాత్రికుడు. ఇందుకు రష్యాకు టిటో రూ.138 కోట్లు చెల్లించారు. ఇక మానవులను ఐఎస్‌ఎస్‌కు తీసుకువెళ్లేందుకు నాసాతో పాటు స్పేస్‌ఎక్స్‌ కూడా వివిధ ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top