ఉ.కొరియాపై ఆంక్షలు యథాతథం

Mike Pompeo dismisses North Korea's 'gangster" - Sakshi

అమెరికాను ‘గ్యాంగ్‌స్టర్‌’గా పేర్కొనడాన్ని ఖండించిన పాంపియో

టోక్యో: అణు నిరాయుధీకరణ పూర్తయ్యేదాకా ఉత్తరకొరియాపై ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పారు. అమెరికా తీరు గ్యాంగ్‌స్టర్‌ మాదిరిగా ఉందన్న ఉత్తరకొరియా ఆరోపణలను ఖండించారు. ఉ.కొరియాతో చర్చల వివరాలను జపాన్, దక్షిణ కొరియా విదేశాంగమంత్రులకు వివరించేందుకు టోక్యో వెళ్లిన ఆయన  విలేకరులతో మాట్లాడారు. ‘చైర్మన్‌ కిమ్‌ అంగీకరించిన ప్రకారం ఉత్తర కొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణ హామీ నెరవేర్చిందన్న నమ్మకం కుదిరాకే ఆంక్షలను ఎత్తివేస్తాం. ప్యాంగ్యాంగ్‌ కోరుకుంటున్నట్లు ఆ దేశ రక్షణకు పూచీ ఇవ్వడం ద్వారా నిరాయుధీకరణ కార్యక్రమం సజావుగా సాగేందుకు అమెరికా ప్రయత్నిస్తుంది’ అని స్పష్టం చేశారు.

గత నెలలో సింగపూర్‌లో జరిగిన ట్రంప్, కిమ్‌ భేటీలో కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం తదుపరి చర్చలు కొనసాగించేందుకు పాంపియో రెండు రోజులపాటు ప్యాంగ్యాంగ్‌లో ఉన్నారు. ‘ఉత్తరకొరియా నాయకత్వంతో జరిపిన చర్చలు ఫలప్రదంగా సాగాయి. నా ప్రయత్నాల వెనుక అంతర్జాతీయ సమాజం కృషి ఉంది. అమెరికా గ్యాంగ్‌స్టర్‌ మాదిరిగా ఉందని ఉ.కొరియా భావించిందంటే, ప్రపంచం కూడా గ్యాంగ్‌స్టరే’ అని అన్నారు. ‘అణు నిరాయుధీకరణ అంటూ గ్యాంగ్‌స్టర్‌ మాదిరిగా షరతులు పెడుతున్న అమెరికా తన వైపు నుంచిæ నిర్మాణాత్మక చర్యలు చేపట్టలేదు’ అని పాంపియోతో చర్చల తర్వాత ఉ.కొరియా ఆరోపించడం తెల్సిందే. తర్వాతి భేటీల్లో పైచేయి సాధించేందుకే ఉ.కొరియా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top