ఆ అమ్మాయి కోసం 300 మంది గాలింపు

Malaysian Police Hunting for Missing London Teenager - Sakshi

న్యూఢిల్లీ : ఆ అమ్మాయి కోసం అడవంతా అణువణువు గాలిస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది సాయుధలు. పోలీసు జాగిలాలతో పరుగులుతీస్తూ హెలికాప్టర్లతో చక్కెర్లు కొడుతున్నారు. మైకుల ద్వారా రారమ్మని పిలుస్తున్నారు. ఘాట్‌ రోడ్డులో వచ్చిపోయే ప్రతి వాహనాన్ని ఆపి ఫొటో చూపించి ఆమె గురించి వాకబు చేస్తున్నారు. తారస పడుతున్నా తండాల ప్రజల సహకారం కూడా తీసుకుంటున్నారు. ఆమె జాడ కోసం మలేసియా ‘స్టేట్‌ ఫైర్‌ అండ్‌ రిస్క్యూ డిపార్ట్‌మెంట్‌’కు చెందిన 80 మంది సిబ్బంది, 200 మంది ఎలైట్‌ కమాండోలు, ‘వ్యాట్‌ 69 కమాండో’ యూనిట్‌కు చెందిన 30 మంది గాలిస్తుండగా, పోలీసులు వారి ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ జాడ దొరక్కపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆమె క్షేమాన్ని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

ఇంత మంది ఆ అమ్మాయి గురించి వెతుకుతున్నారంటే ఆ అమ్మాయి దేశ ప్రధానియో, ప్రధాని కూతురో కాదు. అసలు దేశానికి చెందిన అమ్మాయే కాదు. లండన్‌ పాఠశాలలో చదువుతున్న 15 ఏళ్ల అమ్మాయి. ఆమె పేరు నోరా కొయిరిన్‌. ఆమె స్కూల్‌ విద్యార్థులతో పాటు ఇటీవల మలేసియా వచ్చారు. నెగ్రిసెంబిలాన్‌ రాష్ట్రంలోని ‘డుసన్‌ ఫారెస్ట్‌ ఎకోరిసార్ట్‌’లో బస చేశారు. అటవిలో సంచరించి ఆదివారం రాత్రి తన గదికి వచ్చిన ఆ అమ్మాయి మరుసటి రోజు ఉదయం నుంచి కనిపించడం లేదు. రూము కిటికీ తలుపులు తెరచి ఉండడంతో ఎవరైనా ఆమెను ఎత్తుకపోయి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.

ముందుగా రిసార్ట్‌ ఏరియాలో వెతికిన సాయుధ సిబ్బంది, ఓ చోట ఫెన్షింగ్‌ దెబ్బతిని ఉండడంతో ఆవలనున్న దట్టమైన అటవి ప్రాంతంలో కూడా గాలిస్తున్నారు. ఆ అమ్మాయి ‘హోలోప్రొసెన్సెఫలి’ అనే మెదడు జబ్బుతో బాధ పడుతోందని, సొంతంగా మొబైల్‌ ఫోన్‌కు కూడా సమాధానం ఇవ్వలేదని ఆమె తల్లి మెబ్‌ కొయిరిన్‌ తెలిపారు. ఎక్కడున్న రావాల్సిందిగా ఆమె చేత కూతురిని పిలిపించి, ఆ వాయిస్‌ను రికార్డు చేసి మరి అడవంతా వినిపిస్తున్నా నేటికి ఆమె జాడ దొరకలేదు. ఈ గాలింపు చర్యల్లో భద్రతాపరమైన కారణాల వల్ల అమ్మాయి తల్లిదండ్రులనుగానీ, తోటి విద్యార్థులనుగానీ అనుమతించడం లేదని పోలీసు చీఫ్‌ దాటక్‌ మొహమ్మద్‌ మట్‌ యూసుఫ్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top