626 లైంగిక నేరాలు.. 12,000 సంవత్సరాల జైలు!
మలేషియాలో ఓ వ్యక్తిపై 600కు పైగా లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. అతడు చేసిన నేరానికి దాదాపు 12 వేల సంవత్సరాల జైలు పడనున్నట్లు న్యాయవర్గాలు చెబుతున్నాయి.
కౌలాలంపూర్ : మలేషియాలో ఓ వ్యక్తిపై 600కు పైగా లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. అతడు చేసిన నేరానికి దాదాపు 12 వేల సంవత్సరాల జైలు పడనున్నట్లు న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఇన్ని నేరాలు చేసింది కూడా అతడు ఒకరిపైనే. అది కూడా సభ్య సమాజం తలదించుకునేలా కన్న కూతురుపైన. దర్యాప్తు అధికారులు నమోదు చేసిన 626 ఆరోపణలతో కూడిన ఈ మొత్తం చార్జీ షీట్లను కోర్టులో చదివేందుకు రెండు రోజుల సమయం పట్టింది. వివరాల్లోకి వెళితే.. మలేషియాకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అతడి వద్ద 15 ఏళ్ల కూతురు ఉంది.
ఆమెపై అతడు లైంగిక వికృతక్రీడలు సాగించాడు. చెప్పవీలుకాని విధంగా ప్రవర్తించాడు. చాలా కాలంగా సాగిన అతడి రాక్షస క్రీడ చివరకు వెలుగులోకి చూడటంతో అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు తెలిశాయి. దీంతో అతడిపై మొత్తం 626 చార్జీ షీట్లు పైల్ చేశారు. ఒక్కో నేరం కింద 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల జైలు శిక్షపడనుండగా మొత్తం 600కుపైగా కూతురుపై లైంగిక నేరాలకు పాల్పడిన అతడికి 12,000 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇలాంటి వ్యక్తిని అసలు బయట తిరగనివ్వకూడదని, ఏ మాత్రం క్షమించవద్దని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తి యాంగ్ జరిదాను కోరారు. అతడికి ఎలాంటి బెయిల్, ఉపశమనం కలిగించొద్దని చెప్పారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించారు. నేరం చేసిన ఆ వ్యక్తి పేరును మాత్రం బయటకు చెప్పలేదు. యువతి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ వివరాలు గోప్యంగా ఉంచారు.


