విశాఖ గ్యాస్ లీకేజీపై ఎల్‌జీ కెమ్ స్పందన

LG Chem Says Visakhapatnam Factory Gas Leak Under Control - Sakshi

లాక్‌డౌన్ లో ఉండగానే ప్రమాదం.. దర్యాప్తు చేస్తున్నాం - ఎల్‌జీ  కెమ్

సియోల్ : ఆంధ్రప్రదేశ్‌, విశాఖపట్నం జిల్లాలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి విషవాయువుల లీకైన ఘటనపై దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ కెమికల్స్ స్పందించింది. ఈ  ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సంస్థ ప్రస్తుతం గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో కరోనావైరస్ కట్టడికి అమలువుతున్న దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ప్రభావిత కర్మాగారాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్ సడలింపులతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో నైట్ షిఫ్ట్  కార్మికుడు ట్యాంక్ నుండి లీక్‌ను  గుర్తించినట్టు  దక్షిణ కొరియా ప్రతినిధి చెప్పారు.  (విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)

ప్రస్తుతం పట్టణవాసులకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. సంబంధిత సంస్థల సహకారంతో ప్రజలు, తమ ఉద్యోగులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎల్‌జీ  పాలిమర్స్ యజమాన్య సంస్థ ఎల్‌జీ కెమ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రమాదంలో లీకైన వాయువు పీల్చినపుడు వికారంతోపాటు మైకం ఆవరిస్తుందని తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, వారికి చికిత్స పొందేలా చూడాలని కోరుతున్నట్లు తెలిపింది. (విశాఖకు రానున్న సీఎం వైఎస్‌ జగన్‌)

గురువారం తెల్లవారుఝామున సంభవించిన విష వాయువు లీకేజీ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా, పలువురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చుట్టుపక్కల 5 గ్రామాలను ఖాళీ చేశారు. ఫ్యాక్టరీకి 3 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజలు ఊపిరాడక, పసిపిల్లలతో సహా ప్రాణభయంతో పరుగులు తీస్తూ.. అక్కడిక్కడే కుప్పకూలుతున్న హృదయ విదారక దృశ్యాలు పలువురిని కలచి వేశాయి.  

మరోవైపు  ఈ వార్తలతో ఎల్‌జీ కెమ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కాగా హిందూస్తాన్ పాలిమర్స్ ను స్వాధీనం చేసుకున్న ఎల్‌జీ కెమ్ 1997 లో ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్‌జీ పీఐ)  పేరుతో ప్లాంట్ ఏర్పాటు చేసింది. గత సంవత్సరం ఈ సంస్థ 223 బిలియన్ల ఆదాయాన్ని,  6.3 బిలియన్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top