ఆ సరస్సు నిండా.. గులాబీ నీరే!

ఆ సరస్సు నిండా.. గులాబీ నీరే!


మీరెప్పుడైనా గూగుల్ మ్యాప్స్‌లో ప్రపంచ పటాన్ని పరిశీలించారా..? మహా సముద్రాలు, పర్వత ప్రాంతాలు, మైదానాలు, అడవులు.. ఇలా చాలా కనిపిస్తాయి. మూడొంతులు నీరు మాత్రమే ఉండే భూగోళం ఈ డిజిటల్ మ్యాపుల్లో చూస్తే నీలిరంగులో కనిపిస్తూ ఉంటుంది. ఈ నీలిరంగును చూసీ చూసీ విసిగిపోయి ఉంటే.. ఆస్ట్రేలియాకు దక్షిణ భాగాన ఉండే 'మిడిల్ ఐల్యాండ్స్' వైపు ఓ లుక్కేయండి. అక్కడి సరస్సులోని నీరు గులాబీ రంగులో మెరిసిపోతూ ఉంటుంది..!1802, జనవరి మాసం.. బ్రిటిష్ నావికుడు, అన్వేషకుడు మాథ్యూ ఫ్లిండర్స్ ప్రపంచ యాత్రలో భాగంగా హిందూ మహా సముద్రంలో ప్రయాణిస్తున్నాడు. 'హెచ్‌ఎమ్‌ఎస్ ఇన్వెస్టిగేటర్' నౌకకు కెప్టెన్ అయిన ఆయన తన సిబ్బందితో కలిసి ఆస్ట్రేలియా దక్షిణ తీరానికి చేరుకున్నాడు. నెలల తరబడి జల మార్గంలో ప్రయాణించిన ఫ్లిండర్స్, అతని సిబ్బందికి నేలను చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది. వెంటనే నౌకను లంగరు వేసి, భూమ్మీదకు వచ్చారు. ఎటుచూసినా నిర్మాణుష్యంగా కనిపించడంతో సమీపంలోని పర్వత శిఖరాన్ని ఎక్కాడు. అప్పుడర్థమైంది అతనికి అది ఆస్ట్రేలియా సమీపంలోని దీవి అని! తాగడానికి మంచినీళ్లయినా దొరుకుతాయేమో అన్న ఆశతో ఆ ఎత్తై ప్రాంతం నుంచి చుట్టూ చూశాడు. అప్పుడతనికి 'గులాబీ రంగు' సరస్సు కనిపించింది.హిల్లియర్ లేక్‌గా..

వెంటనే సరస్సు దిశగా అడుగులేశాడు. అక్కడి నీరు గులాబీ రంగులో ఉండటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయాన్నే తన లాగ్‌లో రాసుకొచ్చాడు. అయితే ఫ్లిండర్స్ ఊహించినట్టుగా అందులో మంచినీరు లేదు. అదంతా ఉప్పునీరు. 'మృత సముద్రం నీటికంటే బహుశా ఇవే ఉప్పు కాబోలు' అని ఆ అన్వేషకుడు తన పుస్తకంలో ప్రస్తావించాడు. నౌకాయానంలో భాగంగా తీవ్ర విరేచనాలతో బాధపడి ప్రాణాలు విడిచిన తమ బృంద సభ్యుడు 'విలియం హిల్లియర్' పేరు మీదుగా ఆ సరస్సుకు నామకరణం చేశాడు.ప్రపంచానికి పరిచయం..

ఈ విషయాలన్నీ ఫ్లిండర్స్ బృందం బయటి ప్రపంచానికి వివరించింది. దీంతో ఆ దీవుల గురించి, గులాబీ రంగు సరస్సు గురించీ అందరికీ తెలియవచ్చింది. ఇటువంటి సరస్సులు ఉంటాయా అనే సందేహం అందరిలోనూ చెలరేగింది. అలా ఈ ప్రాంతం ప్రాచుర్యం పొంది, తర్వాతి కాలంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ఈ దీవిలో దట్టంగా ఆవరించి ఉన్న నీలగిరి చెట్ల కారణంగా సరస్సు అందాలు మామూలుగా చూడలేం. హెలికాప్టర్లలో ప్రయాణించి పైనుంచి చూస్తే ఈ సరస్సు మనోహరంగా ఉంటుంది.కారణం..

సరస్సులోని నీటి రంగు ఇలా ప్రత్యేకంగా ఎందుకుందీ అంటే.. నేటికీ స్పష్టమైన సమాధానం లేదు. కొందరు శాస్త్రజ్ఞులు మాత్రం దీనికి కారణం శైవలాలే అంటున్నారు. 'డుయినెల్లా సాలినా' అనే ఒక రకం శిలీంద్రాలు నీటిలో ఉండటం వల్లే సరస్సు ఇలా రంగు పులుముకుందని వారు చెబుతారు. గులాబీ వర్ణంలో కనిపించినప్పటికీ ఈ నీరు చాలా స్వచ్ఛమైనవి, పారదర్శకమైనవి. అయితే ఒక బాటిల్‌లోనో, బకెట్లోనో నీటిని తీసుకున్నా అవి కొంత వరకూ గులాబీ రంగులోనే కనిపిస్తాయి.తేల్చేగుణం..

పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా తరలి రావడానికి కారణం ఈ నీటికి ఉన్న ప్రత్యేక లక్షణమే. ఇందులో మనుషులు తేలుతారు. గాఢమైన లవణీయత కారణంగా ఇది తనలో వస్తువులను ముంచివేయదు. దీంతో ఈతకు ఇది అనుకూలంగా ఉంటుందని చెబుతారు.ఇలాంటిదే..

ఇటువంటి సరస్సు ప్రపంచంలో ఇదొక్కటే కాదు. ఆఫ్రికా దేశమైన శెనగల్‌లోనూ ఉంది. దీన్ని 'లేక్ రెట్‌బా' అని పిలుస్తారు. దీని అర్థం గులాబీ రంగు సరస్సు అని! 40 శాతానికి పైగా ఉన్న లవణీయత దీన్ని పాపులర్ చేసింది. 'డుయినెల్లా సాలినా' కారణంగా ఇందులోనూ నీళ్లు గులాబీ రంగులో మెరిసిపోతాయి. అయితే హిల్లియర్ లేక్‌లా మరీ ముదురు రంగులో కాకుండా పాక్షికంగా రంగు మారి కనిపిస్తాయి.Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top