
ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన కేసులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య సారాకు ఓ న్యాయస్థానం జరిమానా విధించింది.
జెరుసలేం: ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన కేసులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య సారాకు ఓ న్యాయస్థానం జరిమానా విధించింది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన కేసులో సారా రూ.10 లక్షల (15,000 డాలర్లు) జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది. ప్రధాని కుటుంబంపై కోర్టుల్లో ఏళ్లుగా నడుస్తున్న అవినీతి కేసుల్లో ఇది ఒకటి. 2010–2013 సంవత్సరాల్లో ప్రధాని అధికార నివాసంలో పూర్తి స్థాయి చెఫ్ ఉన్నప్పటికీ విలాసవంతమైన హోటళ్లలో తినేవారని, ఇందుకోసం లక్ష డాలర్ల వరకు వెచ్చించారని సారాపై ఆరోపణలున్నాయి.
వాదనలు విన్న కోర్టు రూ.10 లక్షలు (15వేల డాలర్లు) చెల్లించాలని సారాను ఆదేశించింది. విలాసవంతమైన జీవనం, సిబ్బందితో అనుచిత ప్రవర్తన వంటి ఆరోపణలతో సారా(60) ఇజ్రాయెల్ ఇమెల్డా మార్కోస్‌గా పేరుతెచ్చుకున్నారు. ఫిలప్పీన్స్ ఒకప్పుటి నియంత ఫెర్డినాండ్ మార్కోస్ భార్యే ఇమెల్డా. ప్రజాధనంతో విలాసవంతమైన జీవితం గడిపిన ఆమె ఒకప్పుడు వార్తల్లోకి ఎక్కారు.