భారత్‌కు ఏ సాయం చేయడానికైనా రెడీ | Sakshi
Sakshi News home page

ఉగ్రవాద నిర్మూలనలో సాయమందిస్తాం : ఇజ్రాయెల్‌

Published Tue, Feb 19 2019 8:20 PM

Israel Offers Unconditional Help To India To Fight Against Terror - Sakshi

జెరూసలేం : ఉగ్రదాడులతో ఇబ్బందులు పడుతున్న భారత్‌కు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ ఎలాంటి ఆత్మరక్షణ చర్యలు తీసుకున్నా, వాటిని సమర్థిస్తామని ఇప్పటికే అమెరికా స్పష్టం చేసింది. తాజాగా ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి అవసరమైన విజ్ఞానాన్ని, సాంకేతికను భారత్‌కు అందించేందుకు సిద్ధమని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్‌ సైనికుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ మిత్రదేశం భారత్‌కు వెన్నుదన్నుగా ఉంటామని తెలిపింది. 

‘ఏ సహాయం కావాలో చెప్పండి, ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భారత్‌కు ఏ విధమైన సాయమైనా బేషరతుగా అందిస్తాం’ అని భారత్‌లో కొత్తగా నియమితులైన ఇజ్రాయెల్‌ రాయబారి రాన్‌ మాల్కా తెలిపారు. తమకు అత్యంత మిత్రదేశమైన భారత్‌తో మరింత దృఢమైన సంబంధాలను పెంపొందించుకునేందుకు ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సుముఖంగా ఉన్నారని తెలిపారు. కాగా, ఉగ్రవాద నిర్మూలనలో ఇజ్రాయెల్‌ ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. డ్రోన్‌ సాంకేతికతో టెర్రరిస్టులను మట్టుపెట్టడంలో ప్రత్యేకత సాధించింది.  (భారత్‌కు మద్దతు ఇస్తాం: అమెరికా)

ఇదిలాఉండగా.. కశ్మీర్‌లో 40మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బలితీసుకున్న ‘పుల్వామా ఆత్మాహుతి ఉగ్రదాడి’కి సూత్రధారిగా భావిస్తున్న కమ్రాన్‌ అలియాస్‌ అబ్దుల్‌ ఘాజీ రషీద్‌సహా ముగ్గురు జైషే మహ్మద్‌ ముష్కరులను భద్రతా దళాలు హతమార్చాయి. సోమవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ మేజర్‌ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు అమరులయ్యారు. పోలీస్‌ డీఐజీసహా 9 మంది సిబ్బంది గాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి 12 కి.మీ.ల దూరంలోని పింగ్లాన్‌లో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement