భారత్‌కు మద్దతు ఇస్తాం: అమెరికా

America supports India's right to self-defence - Sakshi

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ ఎలాంటి ఆత్మరక్షణ చర్యలు తీసుకున్నా, దాన్ని సమర్థిస్తామని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాన్‌ బోల్టన్‌ ప్రకటించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు బోల్డన్‌ శుక్రవారం ఫోన్‌ చేశారు. దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించేందుకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దాడిని ఖండించిన అమెరికా అధ్యక్ష భవనం.. తమ భూభాగంలోని అన్ని ఉగ్రవాద సంస్థలకు అందిస్తున్న సాయాన్ని పాక్‌ నిలిపివేయాలని హెచ్చరించింది.

పాక్‌ మూల్యం  చెల్లించక తప్పదు: ఇరాన్‌
ఇస్ఫాహన్‌(ఇరాన్‌): తమ దేశంలో ఆత్మాహుతి దాడితో 27 మంది భద్రతా సిబ్బంది మృతికి కారణమైన పాకిస్తాన్‌పై ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది. పాక్‌– ఇరాన్‌ సరిహద్దుల్లోని సిస్తాన్‌–బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో బుధవారం సైనికులతో వెళ్తున్న బస్సును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చడంతో అందులోని 27 మంది మృతి చెందారు. ఆ సైనికుల అంతిమ యాత్రలో ఇరాన్‌ సైనిక దళాల(రివల్యూషనరీ గార్డ్స్‌) కమాండర్‌ మేజర్‌ జనరల్‌ మొహమ్మద్‌ అలీ జఫారీ పాల్గొని, ప్రసంగించారు. ‘ఇప్పటిదాకా ఉపేక్షించాం. ఇకపై ధీటుగా బదులిస్తాం. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాక్‌ భారీ మూల్యం చెల్లించక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు. ఇరాన్‌ బద్ద విరోధి, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదివారం నుంచి పాక్‌ పర్యటన ప్రారంభమవుతున్న సమయంలో ఇలాంటి హెచ్చరికలు వెలువడటం గమనార్హం. తమ సైనికులపై దాడికి పాక్‌ ప్రోత్సాహంతో నడుస్తున్న ‘జైషే ఆదిల్‌’ కారణమని ఇరాన్‌ ఆరోపిస్తోంది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top