‘మానవ తప్పిదం వల్లే ఆ 176 మంది మృతి’

Iran Says Ukrainian Jet Downing That Killed 176 Due To Human Error - Sakshi

టెహ్రాన్‌: ఈ ఏడాది జనవరిలో ఇరాన్‌‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 176 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఈ ప్రమాదానికి గల కారణాలను ఇరాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. మానవ తప్పిదం వల్ల వాయు రక్షణ విభాగం రాడార్‌ సిస్టమ్‌ విఫలమయయ్యిందని తెలిపింది. రాడార్‌ను సమలేఖనం చేయడంలో వైఫల్యం తలెత్తిందని.. ఫలితంగా వ్యవస్థలో 107 డిగ్రీల లోపం ఏర్పడిందని ఇరాన్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడించింది. ఈ తప్పిదం వల్ల వరుస ప్రమాదాలు సంభవించి చివరకు విమానం కూలిపోయిందని అధికారులు ఒక వాస్తవిక నివేదికను విడుదల చేశారు.

ఇరాన్‌, అమెరికాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే టెహ్రాన్ విమానాశ్రయానికి సమీపంలో ఉక్రేయిన్‌కు చెందిన ఈ బోయింగ్‌ 737 విమానం కుప్ప కూలింది. అందులో ప్రయాణిస్తున్న 167 మంది ప్రయాణికులతో పాటు మరో 9 మంది ఫ్లైట్ సిబ్బంది కలిపి మొత్తం 176 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. అయితే ఆ విమానాన్ని తమ రెండు ‘టార్‌ ఎం1’ క్షిపణులు కూల్చేశాయని ఇరాన్‌ అప్పట్లోనే ప్రకటించింది. (ఆ విమానాన్ని మా రెండు క్షిపణులు కూల్చాయి: ఇరాన్)

ఈ క్రమంలో ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ ప్రమాదం జరిగిన నాడు ఇరాన్,‌ అమెరికా దళాలపై దాడులు జరిపింది. ఇందుకు ప్రతీకారంగా అమెరికా తిరిగి మా దళాలపై దాడులు చేస్తుందనే హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఈ క్రమంలో డిఫెన్స్‌ యూనిట్‌ ఆపరేటర్‌  ఆకాశంలో ఎయిర్ ‌క్రాఫ్ట్‌ను గుర్తించాడు. దాంతో ఎలాంటి సమాచారం లేకుండానే రెండు రాడార్లను ఎయిర్‌క్రాఫ్ట్‌ మీదకు ప్రయోగించాడు. ఫలితంగా ప్రమాదం సంభవించింది’ అన్నాడు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top