భారత్ మా ప్రధాన రక్షణ భాగస్వామి

భారత్ మా ప్రధాన రక్షణ భాగస్వామి - Sakshi


అమెరికా ప్రకటన.. రక్షణ రంగంలో ఒప్పందాలు ఖరారు

- మోదీ-ఒబామా చర్చల అనంతరం సంయుక్త ప్రకటనలో వెల్లడి

 

 వాషింగ్టన్: భారత్‌ను అమెరికా తన ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించింది. తద్వారా.. రక్షణ రంగ వాణిజ్యం, సాంకేతికత బదిలీ విషయంలో అమెరికా అతి సన్నిహిత మిత్రులతో సమానంగా భారత్‌నూ పరిగణిస్తుంది. అలాగే.. అధీకృత నౌకాశ్రయ సందర్శనలు, సంయుక్త విన్యాసాలు, శిక్షణ, విపత్తు సహాయం కార్యక్రమాల్లో పరస్పరం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు లాజిస్టిక్స్ ఎక్సేంజ్ అవగాహన ఒప్పందాన్నీ ఇరు దేశాలూ ఖరారు చేశాయి. ప్రధాని మోదీ మంగళవారం అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చలు జరిపిన అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రక్షణ రంగంలో.. రక్షణ మౌలిక సదుపాయాలు, తీరగస్తీ సమాచార మార్పిడి, అమెరికా విమాన వాహక నౌకల సంచారానికి సంబంధించి కీలక ఒప్పందాలను ఖరారు చేయటంలో పురోగతి సాధించామని పేర్కొన్నారు. సంయుక్త ప్రకటనలోని ఇతర వివరాలు..► విస్తృత శ్రేణి ఉభయ(పౌర, సైనిక వినియోగ) సాంకేతికతలను లెసైన్స్‌తో పనిలేకుండా భారత్‌కు అందించడంపై ఇరువురు నేతలు అవగాహనకు వచ్చారు. భారత ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మద్దతుగా రక్షణ పరిశ్రమల అభివృద్ధికి, వాటి ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లలో నిలపడానికి.. అమెరికా-భారత్ రక్షణ సహకారంలో భాగంగా అమెరికా చట్టాలకు తగ్గట్టు భారత్‌కు సరకులు, సాంకేతికతల ఎగుమతులు సాగేలా చూడటాన్ని అమెరికా కొనసాగిస్తుంది.► విమానవాహక నౌకల సాంకేతికతకు సంబంధించిన వివరాలు, సమాచార మార్పిడిపై ఒప్పందానికి కూడా తుది రూపునిచ్చారు. అసియా - పసిఫిక్, హిందూమహాసముద్ర ప్రాంతంలో పరస్పరం ప్రాధాన్య భాగస్వాములుగా పరిగణించాలని నేతలు నిర్ణయించారు.

► ఆసియా పసిఫిక్ ఎకానమిక్ కార్పొరేషన్‌లో చేరాలన్నభారత ఆసక్తినిఅమెరికా స్వాగతించింది. అలాగే భారత్ 2017 ప్రపంచ ఆర్థిక సదస్సును నిర్వహిస్తుంది. ప్రపంచ అభివృద్ధి, భద్రతా సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఐక్యరాజ్యసమితి సామర్థ్యాన్ని పెంపొందించటానికి ఉమ్మడిగానూ, విస్తృత అంతర్జాతీయ సమాజంతోనూ కలిసి ఇరుదేశాలు పనిచేస్తాయి.

► ‘సుస్థిర అభివృద్ధి అజెండా 2030’ని దేశీయంగా, అంతర్జాతీయంగా అమలు చేయటానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. . సియాటిల్‌లో భారత దౌత్యకార్యాలయం

 అమెరికాలోని సియాటిల్ నగరంలో భారత్ త్వరలో కొత్త దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించనుంది. అమెరికాలోని వాయువ్య ప్రాంతంలో భారీ సంఖ్యలో నివసిస్తున్న భారతీయ అమెరికన్ల కోసం ఈ ఆరో దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పఠాన్‌కోట్  సూత్రధారులను పాక్ శిక్షించాలి: ఒబామా

 పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి 26/11 ఉగ్రదాడి వంటిదేనని.. దాని సూత్రధారులను శిక్షించాలని  ఒబామా పాక్‌కు స్పష్టం చేశారు. పాక్  నుంచి భారత్‌కున్న ఉగ్ర ముప్పుై నిరోధంలో అండగా ఉంటామన్నారు. ముంబై, పఠాన్‌కోట్ దాడుల దుండగుల్ని చట్టంముందు నిలబెట్టాలని ఒబామా, మోదీ పాక్‌కు పిలుపిచ్చారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top