రోజుకు సగటున లక్షా యాభై వేల మరణాలు! | How Covid 19 Compared To Other Diseases Over Global Deceased | Sakshi
Sakshi News home page

ఆ దేశాల్లోనే అత్యధిక మంది మరణిస్తున్నారు!

May 20 2020 5:26 PM | Updated on May 20 2020 10:54 PM

How Covid 19 Compared To Other Diseases Over Global Deceased - Sakshi

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా ప్రబలుతున్న తరుణంలో ప్రపంచ దేశాలు విడుదల చేసే రోజూవారీ గణాంకాలు దాని తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు... మహమ్మారి బారిన పడి లక్షలాది మంది మృత్యువాత పడుతున్న తీరు ఆందోళనకరంగా పరిణమించింది. ప్రస్తుతం ప్రపంచ ప్రజానీకం దృష్టి అంతా ఈ అంశాల చుట్టే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కాలంలో ఇతరత్రా జబ్బులు, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల వల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజుకు ఎంత మంది మరణించేవారు.. ఈ గణాంకాలపై కరోనా ఎటువంటి ప్రభావం చూపుతోందన్న అంశం గురించి ఓ సారి పరిశీలిస్తే...  

మొత్తంగా రోజుకు 1,50,000 వేల మంది..
వరల్డ్‌ డేటా 2017 ప్రకారం గుండె జబ్బులతో అత్యధికంగా రోజుకు 48, 742 మంది మరణిస్తున్నారు. కాన్సర్‌ వల్ల 26, 181, శ్వాసకోశ వ్యాధులతో 10, 724 మంది... డిమ్నేషియాతో 6,889, జీర్ణకోశ వ్యాధులతో 6,514 మంది, డయేరియాతో 4,300.. డయాబెటిస్‌తో 3753 మంది మరణిస్తున్నారు. కాలేయ సంబంధిత వ్యాధులతో మృతిచెందే వారి సంఖ్య 3,624.. యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోతున్న వారు 3406 మంది... ఇలా మొత్తంగా అంటువ్యాధులు, పౌష్టికాహార లోపం తదితర కారణాలతో రోజుకు లక్షా యాభై వేల మంది చొప్పున మత్యువాత పడుతున్నట్లు గణాంకాల ద్వారా వెల్లడవుతోంది. ఇక 2004 నాటితో పోలిస్తే హెఐవీతో మరణించే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. రోజుకు సగటున 2600 మంది చొప్పున ఎయిడ్స్‌తో మృతి చెందుతున్నారు. జబ్బులు, ప్రమాదాలే గాకుండా ఉగ్రవాదం, ప్రకృతి విపత్తుల కారణంగా పరిగణించదగ్గ స్థాయిలోనే మరణాలు సంభవిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

చైనా, భారత్‌లోనే ఎక్కువ మరణాలు
ప్రపంచ జనాభాలో వరుసగా మొదటి, రెండు స్థానాల్లో ఉన్న చైనా, భారత్‌లలో వివిధ కారణాలతో రోజుకు 50 వేలకు పైగా మంది మృతి చెందుతున్నారు.  అమెరికాలో 7,564, రష్యాలో 5,013, బ్రెజిల్‌లో 3,528, జర్మనీ 2,528 మంది.. ఇరాన్‌లో 993, కెనడాలో 730, పెరూ 376, బెల్జియంలో 285 మంది చనిపోతున్నారు. 

కోవిడ్‌​-19 మహమ్మారి ప్రభావం
చైనాలో పురుడుపోసుకున్నట్లుగా భావిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను మార్చి 11, 2020న ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌-19ను మహమ్మారిగా ప్రకటించింది. ఆనాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా రోజూవారీ కరోనా మరణాల సంఖ్య 272- 10,520 మధ్య నమోదవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే కరోనా నిర్ధారిత పరీక్షలు, లెక్కల విషయంలో పారదర్శకత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్యలో వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, ఇంగ్లండ్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాల్లో రోజూవారీ కరోనా మరణాల సంఖ్య ఇప్పటికే శిఖరస్థాయిని దాటి తిరోగమనం దిశగా పయనించడం హర్షించదగ్గ విషయమని.. అయితే కాలం గడుస్తున్న కొద్దీ కోవిడ్‌-19 మరణాలపై కచ్చితమైన గణాంకాలు వెలువడే అవకాశం ఉందని మెజారిటీ ప్రజల అభిప్రాయం. 

కాగా కోవిడ్ వ్యాప్తికి ముందు హృద్రోగులు, ఆ తర్వాత క్యాన్సర్‌ రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతుండేవి. అయితే కరోనా ‌కేసుల తీవ్రత పెరిగినప్పటి నుంచి కరోనా ఆస్పత్రులు మినహా అన్ని ఆస్పత్రుల్లో హృద్రోగులు, కాన్సర్‌ పేషెంట్ల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల గుండె జబ్బులను పెంచే పర్యావరణ కాలుష్యం తగ్గిపోవడం, వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం లభించడంతో వృత్తిపరమైన ఒత్తిళ్లు, ప్రయాణ బడలికలు తగ్గిపోవడం... వేళకు నిద్రపోయే వెసలుబాటు లభించడం... ఆరోగ్యానికి హానికరమైన ధూమపానం, మద్యపానం అందుబాటులో లేకపోవడం వల్ల సదరు కేసుల సంఖ్య మూడోవంతు నుంచి సగం వరకు కేసులు తగ్గాయని అంతర్జాతీయ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే లాక్‌డౌన్‌ కారణంగా వైద్య సదుపాయాలు అందక మరణించే వారి సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement