త్వరలో అదృశ్య టీవీలు... | Sakshi
Sakshi News home page

త్వరలో అదృశ్య టీవీలు...

Published Sun, Oct 9 2016 12:48 AM

త్వరలో అదృశ్య టీవీలు...

ఇప్పటివరకు మీరు చాలా టీవీలు చూసే ఉంటారు. పోర్టబుల్ నుంచి ప్లాస్మా టీవీల వరకు అన్నింటినీ చూసే ఉంటారు కానీ మాయమయ్యే టీవీలను మాత్రం కచ్చితంగా చూసి ఉండరు. త్వరలో మాయమయ్యే టీవీ (ఇన్‌విజిబుల్)లు దర్శనమివ్వనున్నాయి. అంటే కేవలం గాజు గ్లాసుతో తయారు చేసిన స్క్రీన్ మాత్రమే టీవీగా మారబోతుంది. మీరు టీవీని ఉపయోగించని సమయంలో అది కాస్తా పారదర్శకంగా గాజు గ్లాసులాగా మారిపోయి దాని వెనుకవైపు ఉన్న వస్తువులు స్పష్టంగా కనపడుతాయి. ఈ అదృశ్య టీవీని పానాసోనిక్ సంస్థ రూపొందించింది.

సాధారణంగా అన్ని టీవీల స్క్రీన్స్ ఎల్‌సీడీ, ఎల్‌ఈడీలతో రూపొందిస్తే ఈ అదృశ్య టీవీలో మాత్రం ఓఎల్‌ఈడీ స్క్రీన్స్‌ను వినియోగించారు. దీనివల్ల ప్రతిబింబం నాణ్యత మరింత పెరుగుతుంది. ఈ టీవీని గత జనవరిలో లాస్‌వేగాస్‌లో జరిగిన వినియోగదారుల ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శనలో ఆవిష్కరించారు. ఎల్‌ఈడీ టీవీల్లో దృశ్యం కనపడాలంటే సాధారణంగా పిక్చర్ ట్యూట్‌లో వెనుక ఒక లైట్ ఉంటుంది. కానీ ఓఎల్‌ఈడీ స్క్రీన్స్‌లో ఈ లైట్ అవసరమే లేదు. జనవరిలో ఆవిష్కరించిన ఈ అదృశ్య టీవీని ప్రస్తుతం పూర్తిగా అప్‌డేట్ చేసి అందిస్తున్నారు. టీవీని ఆఫ్ చేసినపుడో లేక వాడనప్పుడో ఇది కాస్తా అదృశ్యమై సాధారణ గ్లాస్‌గా మారిపోతుంది. ఒక సెల్ఫ్‌కు ఏర్పాటు చేసిన ఈ గ్లాస్... స్లైడింగ్ డోర్‌గానూ, టీవీ స్క్రీన్‌గానూ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది.

Advertisement
Advertisement