
43 మంది వరదల్లో చిక్కుకుని మృతి చెందగా.. మరో 24 మంది గల్లంతయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
పట్నా : గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పొరుగు దేశం నేపాల్ అతలాకుతలమైంది. నదుల్లో వరద పొంగిపొర్లడంతో కొండప్రాంతాల్లోని ప్రజలకు తీవ్ర ముప్పు నెలకొంది. ఇప్పటికే అక్కడ 43 మంది వరదల్లో చిక్కుకుని మృతి చెందగా.. మరో 24 మంది గల్లంతయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. లలిత్‌పూర్, ఖోతంగ్, భోజ్‌పూర్, కావ్రే, మాక్వాన్‌పూర్, సిందూలి, ధాదింగ్ ప్రాంతాల్లో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఎడతెగని వర్షాల కారణంగా నేపాల్ సరిహద్దు రాష్ట్రమైన బిహార్‌లోని 6 జిల్లాలు వరదమయమయ్యాయి. సుపాల్, మజఫర్‌పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, అరారియా, కిషన్ గంజ్ జిలాల్లోలోని ప్రజల్ని స్థానిక యంత్రాంగం, జాతీయ విపత్తు సహాయక బృందాలు (ఎన్డీఆర్‌ఎఫ్) సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
ఆదివారం కూడా నేపాల్‌లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా కోషి, గండక్, బుది గండక్, గంగ, భాగమతి నదుల్లో వరద ఉధృతి పెరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని బిహార్ సీఎం నితీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు.