ఆనందానికి అర్థం ప్రేమేనా....!

ఆనందానికి అర్థం ప్రేమేనా....!


ఆనందం అంటే ఏమిటి? ఆనందంగా జీవించడం ఎలా? మనిషి జీవనశైలికి, ఆనందానికి సంబంధం ఉందా? డబ్బులుంటే ఆనందం ఉంటుందా? సమాజంలో హోదాను బట్టి ఆనందం పెరుగుతుందా? ఆనందానికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటి? ఆనందంగా ఉన్నవాళ్లు ఎక్కువకాలం జీవిస్తారా? ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారా? చివరకు ఆనందమయ జీవితం వెనకనుండే అసలు రహస్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక మానవ బృందంపై ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 79 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ మహా అధ్యయనానికి దశాబ్దాల పాటు కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి ఇప్పటికి తేల్చిందేమంటే.. ఆనందమయ జీవితానికి అర్థం ప్రేమట. ప్రేమంటేనే జీవితాలు ఆనందంగా ఉంటాయట. ఈ ప్రేమ భార్యాభర్తల అనుబంధాల మధ్యనే కాదు, తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు, అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాల మధ్య కూడా ప్రేముండటమే అనుబంధమట. స్నేహితుల మధ్య అనుబంధానికి కూడా ప్రేమే కారణమట. ప్రేమతోనే ఆనందం వస్తుందని, అదే జీవన పరమార్థమని, ఆనందానికి డబ్బులు, హోదాలు ప్రాతిపదిక కావని చెబుతున్నారు.



ఈ అధ్యయనం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇంతటితో ఈ అధ్యయనాన్ని ఆపేయాలని కూడా సూచిస్తున్నారు. ఈ విమర్శలను, సూచనలు దృష్టిలో పెట్టుకొనేమో అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఈ ఏడాది అధ్యయన కేటాయింపుల్లో పది శాతం కోత విధించింది. రానున్న సంవత్సరాల్లో మరింత కోత విధించే అవకాశాలు ఉన్నాయి. కేవలం తెల్లవారిపైనే, అందులోనూ అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్‌ కెన్నడీ కుటుంబం లాంటి జీవితాలను అధ్యయనం చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వివిధ జాతులకు చెందిన ప్రజల జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి గానీ, ఇదేమి అధ్యయనం అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.



1938లో నుంచి తాము చేస్తున్న అధ్యయనంలో మొదటితరానికి చెందిన వారిలో కొందరు మరణించారని, రెండో తరం, మూడో తరంపై కూడా తమ అధ్యయనాలు కొనసాగుతున్నాయని అధ్యయనానికి నాయకత్వం వహిస్తున్న రాబర్ట్‌ వాల్డింగర్‌ తెలిపారు. తరాలను బట్టి ఆనందానికి అర్థం మారుతుందని, అలాంటి మార్పును అధ్యయనం చేయడానికి, భవిష్యత్‌ తరాలు ఎలా ఉంటాయో అంచనా వేయడానికి తమ అధ్యయనాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top