10 వేల ఏళ్లు పనిచేసే గడియారం..

Giant Clock Inside A Mountain - Sakshi

ఆదిత్య 369 సినిమాలో కాలాన్ని వెనక్కి తీసుకెళ్లే టైమ్‌ మిషన్‌ని చూసి ఆశ్చర్యపోయాం. రీసెంట్‌గా 24 సినిమా కూడా కాలానికి సంబంధించిన అంశాలతోనే తెరకెక్కింది. కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ అటువంటి అద్భుతాన్ని చూసే అవకాశం కల్పిస్తామంటోంది కాలిఫోర్నియాకు చెందిన లాంగ్‌ నౌ ఫౌండేషన్‌. కానీ వీరు రూపొందించే గడియారం కాలాన్ని వెనక్కి తీసుకెళ్లదు గానీ 10 వేల ఏళ్ల వరకూ పనిచేస్తుంది. 150 మీటర్ల పొడవుండే ఈ గడియారాన్ని వెస్ట్‌ టెక్సాస్‌లోని కొండ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ ఆలోచనకు 1995లోనే బీజం పడింది. అమెరికాకు చెందిన ఆవిష్కర్త డానీ హిల్స్‌ ఒక ప్రత్యేకమైన గడియారాన్ని తయారు చేయాలని భావించారు. మామూలు గడియారాల్లా దీనిలో గంటలు, నిమిషాల ముళ్లు ఉండవు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ‘టిక్‌’మని శబ్దం చేస్తుంది. అందులో ఉన్న ‘హ్యాండ్‌’  ఒక శతాబ్దం తర్వాత కదులుతుంది. ప్రతీ వెయ్యేళ్లకు ఒకసారి గడియారంలో కోకిల బయటకు వచ్చి శబ్దం చేస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ ఈ గడియార నిర్మాణం కోసం తన వంతుగా 42 మిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

కేవలం ఖర్చులకే పరిమితం కాకుండా దాని రూపకల్పనలోనూ భాగస్వామ్యం అవుతున్నారు. ఇప్పటికే పాక్షికంగా రూపొందించిన ఈ గడియార నిర్మాణంలో మెరైన్‌ గ్రేడ్‌ 316 రకానికి చెందిన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ను వినియోగిస్తున్నారు. వేల ఏళ్ల పాటు నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి భాగాలకు తుప్పు పట్టకుండా ఉండేందుకు హైటెక్‌ సిరామిక్‌ పూతను పూస్తున్నారు. సాధారణంగా గడియారం తిరగడంలో కీలకపాత్ర పోషించే బేరింగ్స్‌ ఈ క్లాక్‌లో మాత్రం కొద్ది వేగంతోనే తిరుగుతాయి.

పవర్‌ అవర్స్‌
ఎన్నో ప్రత్యేకతలున్న ఈ గడియారంపైన అమర్చిన మెటల్‌ రాడ్స్‌ సాయంతో ఉష్ణోగ్రతలోని మార్పుల ఆధారంగా శక్తిని ఉత్పత్తి చేసుకొని లోపలి భాగాలకు అందిస్తుంది. అయితే, గడియారం సరైన సమయం సూచించాలంటే ప్రతి రోజూ మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి మ్యాన్యువల్‌గా దాన్ని తిప్పాల్సివుంటుంది. లాంగ్‌ నౌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌, మ్యూజీషియన్‌ బ్రేన్‌ ఈనో మాట్లాడుతూ... 10 వేల ఏళ్ల పాటు పని చేయనున్న ఈ గడియారానికి సంబంధించిన గంట శబ్దం రొటీన్‌గా కాకుండా భిన్న రకాల మెలొడీలను ట్యూన్‌ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతానికి గడియారానికి సంబంధించిన నమూనాను మాత్రమే రూపొందించి, లండన్‌ సైన్స్‌ మ్యూజియంలో ఉంచారు. ప్రత్యక్షంగా ఈ అద్భుత గడియారాన్ని మరి కొన్నేళ్లు నిరీక్షించక తప్పదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top