భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవాల్సిందే

France Demands For Permanent Membership In UN Security Council - Sakshi

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలి : ఫ్రాన్స్‌

పారిస్‌: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న భారత్‌కు ఆహోదా కల్పించాల్సిందేనని ఫ్రాన్స్‌ అభిప్రాయపడింది. భారత్‌తో పాటు జర్మనీ, బ్రెజిల్‌, జపాన్‌కు భద్రతా మండలిలో చోటు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రపంచీకరణ, సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయా దేశాలకు శాశ్వత హోదా ఇవ్వాలని ఫ్రాన్స్‌ కోరింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో యూఎన్‌ఓ ఫ్రాన్స్‌ ప్రతినిధి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ అంశం ఆ దేశ వ్యూహాత్మక విధానాల్లో అత్యంత ప్రాధాన్య అంశంగా మారుతందని ఆయన పేర్కొన్నారు.

‘‘ఐరాస భద్రతా మండలి పరిధిని విస్తృతం చేయడం, అందుకు దారితీసే చర్చల్లో విజయం సాధించడానికి జర్మనీ, ఫ్రాన్స్‌కు పటిష్ఠ విధానం ఉంది. ప్రపంచ దేశాలకు తగిన ప్రాతినిధ్యం లభించాలంటే యూఎన్‌ఎస్సీలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది’’ అని ఐరాసలో ఫ్రాన్స్‌ శాశ్వత ప్రితినిధి ఫ్రానోయిస్‌ డెలాట్రే స్పష్టం చేశారు. అందులో భాగంగా భారత్‌, జర్మనీ, జపాన్‌, బ్రెజిల్‌తో పాటు ఆఫ్రికా దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దానికోసం తమవంతుగా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలను మధ్య సమన్వయం చేయడంలో యూఎన్‌ఓ పాత్రను మరింత పటిష్ఠం చేయడానికి జర్మనీ, ఫ్రాన్స్‌ కలిసి పనిచేస్తున్నాయని డెలాట్రే తెలిపారు. అందుకు మండలిలో తగిన మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు.

మండలి సంస్కరణ ఆవశ్యకతను భారత్‌ కూడా తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సర ప్రారంభంలో జరిగిన ఓ సమావేశంలో.. మండలిలో సమాన ప్రాతినిధ్యం అంశాన్ని ఐరాస భారత ప్రతినిధి అక్బరుద్దీన్‌ కూడా లేవనెత్తిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలి విస్తరణకు 122 దేశాల్లో 113 సభ్య దేశాలు సముఖంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే అనేక అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్‌ ఈ అంశాన్ని లేవనెత్తింది. ప్రపంచ దేశాల్లో భారత్‌ బలమైన శక్తిగా అవతరిస్తున్న నేపథ్యంలో భద్రతా మండలిలో సభ్యుత్వం ఖచ్చింతంగా సాధించాలని భారత్‌ ప్రయత్నిస్తోంది. దీని కొరకు ఇప్పటికే అనేక దేశాల మద్దతును కోరుతోంది.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top