ఆ బ్యాక్టీరియా అతని శరీరాన్ని తినేస్తోంది..

Flesh Eating Bacteria Attacked Crabber In New Jersey - Sakshi

న్యూజెర్సీ : మాంసం తినే బ్యాక్టీరియా పీతల వేటగాడి పాలిట శాపంగా మారింది. శరీరంలోని భాగాలను కొద్ది కొద్దిగా తింటూ అతన్ని చావుకు దగ్గర చేస్తోంది. ఈ సంఘటన న్యూజెర్సీలోని మ్యాట్స్‌ ల్యాండింగ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూజెర్సీకి చెందిన ఏంజెల్‌ పెరెజ్‌ అనే పీతల వేటగాడు జూలై 2వ తేదీన మోరైస్‌ నదిలో వేటకు వెళ్లి పీతలు పట్టి ఇంటికి చేరుకున్నాడు. ఆ మరుసటి రోజు అతని కుడికాలు కొద్దిగా వాపుకు గురై బొబ్బలతో ఎర్రగా మారింది. అతడికి ఇదివరకే పార్కిన్‌సన్స్‌ అనే వ్యాధి ఉండటంతో కుటుంబసభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. ఆస్పత్రిలో చేరినప్పటికి.. దాన్ని ఓ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌గా భావించిన వైద్యులు ఏవో మందులు రాసి అతన్ని ఇంటికి పంపించారు.

కొద్ది రోజుల తర్వాత ఆ ఇన్‌ఫెక్షన్‌ పెరెజ్‌ రెండో కాలికి కూడా సోకింది. దీంతో మళ్లీ అతను ఆస్పత్రిలో చేరగా అతని పరిస్థితిని గమనించిన వైద్యులు ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అసలు విషయం బయటపడింది. విబ్రియో అనే మాంసం తినే బ్యాక్టీరియా అతని శరీరంలోకి ప్రవేశించి కొద్ది కొద్దిగా అతని కాళ్లను తింటోందని తేలింది. ఆ ఇన్‌ఫెక్షన్‌ రెండు కాళ్లకు పూర్తిగా వ్యాపించి అతని ప్రాణానికే ముప్పగా మారింది. ప్రస్తుతం ఏంజెల్‌ పెరెజ్‌ 24గంటల అత్యవసర విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top