
ధర్మపురి: ఈనెల 12న న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన విశ్మసుందరి అందాల పోటీల్లో మిసెస్ చికాగో యూనివర్స్–2026 టైటిల్ గెలుచుకున్న సౌమ్య స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి. ధర్మపురికి చెందిన వొజ్జల మోహన్, సావిత్రి దంపతుల కూతురు సౌమ్య.. 2025 మే 4న మిసెస్ భారత్ ఇల్లినాయిస్ అందాల పోటీల్లో విజయం సాధించారు. తాజాగా మిసెస్ చికాగో యూనివర్స్‌ను గెలుచుకోవడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1985 జనవరి 22న జన్మించిన సౌమ్య బెంగళూర్, నాగాపూర్, ముంబయి, దహను నగరాల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు.
ధర్మపురికి చెంది.. అమెరికాలో స్థిరపడిన బొజ్జ వాసుతో వివాహమైంది. అనంతరం మిల్వాకి యూనివర్సిటీ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పొందారు. ప్రస్తుతం ఆమె ఓ బహూళజాతి సంస్థలో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్, కొరియోగ్రఫీపై ఉన్న మక్కువతో ఇల్లినాయిస్‌లోని చికాగోలో వస్త్రం బై సౌమ్య అనే ఫ్యాషన్ బోటిక్‌ను స్థాపించారు. 2025లో న్యూయార్క్‌లో ఫ్యాషన్ వీక్ డిజైనర్‌గా అడుగుపెట్టబోతున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతోపాటు సామాజిక కార్యకర్తగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. గృహహింస బాధితులకు సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సౌమ్య తాజాగా ఈ ఏడాది మార్చిలో ధర్మపురికి వచ్చి వెళ్లారు.
కుటుంబం ప్రోత్సాహంతో..
విశ్వసుందరి పోటీల్లో టైటిల్ గెలుచుకోవడంలో తల్లిదండ్రులు, భర్త సహాయం బాగుంది. ప్రతిభ, అంకిత భావం, కృషి, పట్టుదలతోనే ఈ స్థాయికి ఎదిగాను. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తా.