
అందం పరంగానూ సేవలోనూ మేటీ అనేలా విభిన్న రంగాల్లో సత్తా చాటారామె. గ్లామర్‌పరంగా నటన, మోడల్ రంగంల వైపుకి పరిమితం కాకుండా దేశ సేవలో పాలుపంచుకుని సైనికురాలు కావాలని ఆకాంక్షించిందామె. అత్యంత విరుద్ధమైన రంగాన్ని ఎంచుకుని యువతకు ఆదర్శంగా నిలిచింది. సుకుమారం అనేది శరీరానికే గానీ మనసుకు కాదని, మనః సంకల్పం ఉంటే ఎందులోనైనా రాణించగలం అని ప్రూవ్ చేసి స్ఫూర్తిగా నిలిచింది.
ఆమెనే కాశీష్ మెత్వానీ. ఆమె 2023లో మిస్ ఇంటర్నేషనల్‌గా ఇండియాగా కిరీటాన్ని గెలుచుకుంది. నిజానికి అందాలరాణిగా సత్తా చాటగానే మోడలింగ్ ఆఫర్లు, యాక్టింగ్ ఆఫర్లు అందుకుని గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెడుతుంటారు చాలామంది. కానీ కాశీష్ అందుకు విరుద్ధంగా సాయుధ రంగాన్ని ఎంచుకోవడం విశేషం. నిజానికి ఆమె కుంటుంబం ఆర్మీ నేపథ్యానికి చెందింది కూడా కాదు.
అయినా ఆమె దేశ సేవలో భాగం కావాలనే ఆకాంక్షతో ఆర్మీలో చేరింది. పూణేకి చెందిన కాశీష్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో కీలక భాద్యతలు నిర్వర్తిస్తోందామె. ఎప్పుడూ కొంగొత్త విషయాలను తెలుసుకోవడంపై ఉన్న ఆసక్తే ఆమెనే ఈ విరుద్ధమైన రంగంలోకి వచ్చేలా చేసింది. అదీగాక ఎన్‌సీసీలో ఉండగా రిపబ్లిక్ డే పరేడ్ కవాతులో భాగస్వామ్యం అయినప్పుడు తనకు ఆర్మీ ఫీల్డే బెస్ట్ అని ఫీలయ్యేదట. ఆ నేపథ్యంలోనే తన కుటుంబాన్ని ఒప్పించి మరి ఇలా ఆర్మీలో చేరానని చెబుతోంది కాశీష్.
విద్యా నేపథ్యం..
పూణేలోని సావిత్రిబాయి ఫులే విశ్వవిద్యాలయం నుంచి బయోటెక్నాలజీలో ఇంటిగ్రేటడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. అలాగే బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో థీసిస్ పూర్తి చేసి, హార్వర్డ్ విశ్వవిద్యాయలంలో పీహెచ్‌డీ చేసే ఛాన్స్ కొట్టింది కూడా.
కానీ సైన్యంలో చేరాలనే ఉద్దేశ్యంతో ఆ ఆఫర్‌ని తిరస్కరించినట్లు కాశీష్ వెల్లడించింది. రెండేళ్ల క్రితమే మిస్ ఇంటర్నేషనల్ ఇండియాగా కిరీటం కైవసం చేసుకున్న తాను మోడలింగ్, నటన వైపుకు వచ్చేలా పలు ఆఫర్లు వచ్చాయని, కానీ తాను ఆర్మీ రంగాన్ని ఎంచుకోవాలనే ఆలోచన మనసులో ఉండటంతో వెళ్లలేదని చెప్పుకొచ్చింది.
అంతేగాదు ఇటీవల ఆపరేషన్ సిందూర్‌లో కీలకపాత్ర పోషించిందామె. ఆ సమయంలో ఆమె ఎయిర్ డిఫెన్స్ విభాగంలో సేవలందించింది. ఇక కాశీష్ తండ్రి మాజీ శాస్త్రవేత్త. ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (DGQA)లో డిఫెన్స్ సివిలియన్‌గా చేరారు. ఆమె తల్లి ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు. తన కుటుంబానికి ఎలాంటి ఆర్మీ నేపథ్యం లేకపోయినా తన నిర్ణయానికి మద్దతిచ్చారని అంటోంది కాశీష్.
ఇక ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ శిక్షణలో అత్యున్నత మెరిట్‌ని అందుకుని ప్రతిష్టాత్మకమైన ఏఏడీ మెడల్, సిఖ్ లి రెజిమెంట్ మెడల్, షూట్ డ్రిల్, డిసిప్లీన్ బ్యాడ్జ్, కమాండెంట్స్ పెన్ వంటి విశిష్ట పురస్కారాలను అందుకుంది. ప్రస్తుతం బెటాలియన్ అండర్ ఆఫీసర్‌గా, అకాడమీ అండర్ ఆఫీసర్‌గా సారథ్యం వహించనుంది. ఇక కాశీష్ బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. బాస్కెట్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్‌లో కూడా అకాడమీకి ప్రాతినిధ్యం వహించింది. ప్రతిభను చాటడమే కాకుండా, ప్రధాన ఈవెంట్‌లకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిందామె.
(చదవండి: టీ బ్రేక్' అలా మన లైఫ్‌లో భాగమైంది..!)