'టీ బ్రేక్‌' ఎలా వచ్చిందో తెలుసా..! | Hyderabad's Chai Culture: A Timeless Tradition of Warmth | Sakshi
Sakshi News home page

'టీ బ్రేక్‌' అలా మన లైఫ్‌లో భాగమైంది..!

Sep 14 2025 11:45 AM | Updated on Sep 14 2025 12:14 PM

Hyderabad's Chai Culture: A Timeless Tradition of Warmth

సంస్కృతి పరంగా ఎన్నో రకాల గొప్పతనాన్ని కలిగి ఉన్న మన నగరం, చక్కని చిక్కని చాయ్‌ సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందింది. నగర రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారింది. కాసిన్ని కబుర్లు కలబోసుకునే స్నేహితుల కోసం కావొచ్చు.. కాస్ట్‌లీ లావాదేవీలు నిర్వహించే కార్పొరేట్స్‌కి కావొచ్చు.. టీ బ్రేక్స్‌ ఉండాల్సిందే.. ఇంత బలంగా సిటీ లైఫ్‌లోకి చొచ్చుకుపోయిన చాయ్‌ పునాదులు కూడా అంతే బలమైనవి అంటోంది చరిత్ర. 
 

మొఘలుల కాలంలో, ఇది పాలకవర్గానికి చెందిన ఒక ఫ్యాషన్‌ పానీయంగా చరిత్రకారులు పేర్కొంటారు. ఈ ప్రాంతాన్ని శతాబ్దాల తరబడి పాలించిన నిజాంలు టీ తాగడాన్ని తాము ఆస్వాదించడంతో పాటు ప్రజలనూ ప్రోత్సహించారు. అదే చేత్తో వారు దక్షిణాదికి తీసుకువచ్చిన పర్షియన్‌ ప్రభావాలు టీ చుట్టూ ఒక అధునాతన మర్యాద వ్యవస్థను రూపొందించడంలో సహాయపడ్డాయి. పర్షియన్‌ టీ హౌస్‌ల స్ఫూర్తితో నగరంలో తొలిదశ ఇరానీ కేఫ్‌లను జొరాస్ట్రియన్‌ వలసదారులు ప్రారంభించారని చెబుతారు. ఇవి తొలినాళ్లలో కేవలం పురుషుల రాజకీయ చర్చలకే పరిమితమై ఉండేవట.

ఏదేమైనా నేడు అది ఒక అందమైన శక్తివంతమైన చాయ్‌ కల్చర్‌గా నగరంలో స్థిరపడింది. ప్రస్తుతం నగరంలో చాయ్‌ ఒక పానీయం మాత్రమే కాదు.. ఉల్లాసమైన సంభాషణలతో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన సామాజిక అనుభవం కూడా. టీ సంస్కృతి నగరంలో వరి్థల్లడానికి బాటలు వేసిన వాటిలో ఇరానీ కేఫ్స్‌దే ప్రధాన పాత్ర కాగా మిగిలినవి కూడా తమవంతు పాత్ర పోషించాయి.

రుచికరమైన వంటకాలతో పాటు చాలా చరిత్ర కలిగిన అత్యంత ప్రజాదరణ పొందాయి ఇరానీ కేఫ్‌లు ‘ఇరానీ చాయ్‌’ సహా వివిధ రకాల టీలను ఇవి అందిస్తాయి.స్నేహపూర్వక చాయ్‌ వాలాలు నిర్వహించే స్ట్రీట్‌ చాయ్‌ స్టాల్స్‌ కూడా సిటీలో టీ కల్చర్‌కు తమవంతు బలాన్ని 
అందించాయి. తక్కువ, సరసమైన ధరలకు పొగలు వచ్చే ఛాయ్‌లను ఇవి అందిస్తాయి.

ఇటీవల వినూత్న మిశ్రమాలు ఫ్యూజన్‌ పానీయాలను అందించే ఆధునిక కేఫ్‌ సంస్కృతిని సైతం నగరం స్వీకరిస్తోంది. చాయ్‌ పాయింట్, చాయ్‌ షాయ్‌ మసాలా, చాయ్‌ లాట్టే, ఐస్డ్‌ చాయ్‌ 
వంటివి విభిన్న రుచులతో ప్రయోగాలు చేసే యువతను ఆహా్వనిస్తున్నాయి. 

సిటీలో చాయ్‌ వ్యాపారం ఒక భారీ పరిశ్రమగా మారింది. అనేక మంది వ్యవస్థాపకులు తమ సొంత టీ బ్రాండ్‌లు కేఫ్‌లను ప్రారంభించారు. చాయ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవలను ప్రారంభించి, తాజా మిశ్రమ టీలను వినియోగదారుల ఇంటికే అందించే వారు కూడా ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న తరాన్ని చేరుకోవడానికి ఆన్‌లైన్‌లో చాయ్‌ని ఆర్డర్‌ చేసే యాప్‌లు ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఉద్భవించాయి. 

చాయ్‌ రుచి కోసం ఎక్కువ మంది వినియోగిస్తుండగా, ఆరోగ్యం కోసం కూడా కొందరు ఎంచుకుంటున్నారు. దీని తయారీలో అల్లం ఏలకులు మిరియాలు తదితర సుగంధ ద్రవ్యాలు సైతం 
మేళవిస్తూ ఆరోగ్యార్థులను 
ఆకట్టుకుంటున్నారు.

నగరంలో చాయ్‌ మాత్రమే కాదు దానికి తోడుగా తీసుకునే సైడ్‌ 
డిష్‌లూ అంతే ఫేమస్‌. తేలికపాటి తీపి, ఉప్పదనాల కలయికగా 
ఉండే ఉస్మానియా బిస్కెట్లు ఇరానీ చాయ్‌తో శతాబ్దాలుగా జట్టు కట్టాయి. అలాగే టీతో 
జత కట్టడంలో ఖారా బిస్కెట్స్‌ కూడా వీటితో పోటీపడుతున్నాయి. మరోవైపు మసాలా 
దినుసులతో నిండిన త్రిభుజాకారపు పట్టి సమోసా కూడా క్లాసిక్‌ కాంబినేషన్స్‌లో ఒకటిగా కొనసాగుతోంది. ఉల్లి సమోసాలతో పాటు ఇప్పుడు పోహా సమోసా దాకా భిన్న రకాలు వచ్చేశాయి. మలైబన్, బన్‌మస్కా వంటి బన్స్‌ క్లాసిక్‌ ఆధునిక కేఫ్‌లు అందించే ఇరానీ చాయ్‌కి ప్రసిద్ధ 
అనుబంధంగా పేరొందాయి.

కేఫ్‌ నీలోఫర్‌: నగరంలోని అత్యంత ప్రసిద్ధ ఐకానిక్‌ టీ హౌస్‌లలో ఒకటి, ఇది ఒక సాధారణ స్టాల్‌ నుంచి బహుళ అవుట్‌లెట్‌ బ్రాండ్‌గా విస్తరించింది. మార్చి 2025లో, ఇది రాయదుర్గంలో 40,000 చదరపు అడుగుల దేశంలోనే అతిపెద్ద కేఫ్‌ను ఏర్పాటు చేసింది.

చార్మినార్‌ సమీపంలో ఉన్న నిమ్రా కేఫ్‌ బేకరీ, తాజా బిస్కెట్లు స్ట్రాంగ్‌ చాయ్‌లతో స్థానికులతో పాటు పర్యాటకులనూ స్వాగతిస్తుంది.

జూబ్లీహిల్స్‌లోని చాయ్‌ పానీ కేఫ్‌ భిన్న రకాల చాయ్‌ వెరైటీలకు పేరొందింది. ఇది చాయ్‌తో పాటు 
వైవిధ్యభరిత రెట్రో వాతావరణాన్ని అందించే ప్లేస్‌. దీని అల్లం టీ బాగా ఫేమస్‌..

బ్లూ సీ: సికింద్రాబాద్‌లో పేరొందిన ఇరానీ చాయ్‌ సెంటర్‌ ఇది. టీతో పాటు ఎగ్‌ పఫ్‌లు, దిల్‌ఖుష్‌
(తీపి బన్‌)లకు ప్రసిద్ధి.

రోస్ట్‌ సిసికె: బంజారాహిల్స్‌లోని ఈ కేఫ్‌ వివిధ రకాల బేకరీ ఉత్పత్తులను అందిస్తుంది. ఇక్కడి మసాలా చాయ్‌కి ఫ్యాన్స్‌ ఉన్నారు.కాఫీ సంగమ్‌: 90ల నాటి క్లాసిక్‌ తెలుగు స్నాక్స్‌ను తిరిగి గుర్తు చేసే కేఫ్, కడక్‌ చాయ్‌తో పాటు పామ్‌ షుగర్‌ బన్‌ శాండ్‌విచ్‌లు వంటి ప్రత్యేకమైన కాంబినేషన్‌కు పేరొందింది.

అబిడ్స్‌లో 1935లో ఏర్పాటైన గ్రాండ్‌ హోటల్‌ సిసలైన హైదరాబాదీ చాయ్‌ను అందిస్తుంది. 
సోమాజిగూడలోని రెడ్‌ రోజ్‌ రెస్టారెంట్‌ విద్యార్థులు యువతను ఆకట్టుకుంటుంది. ఇన్‌స్ట్రాగామ్‌లో సైతం ఈ కేఫ్‌ యాక్టివ్‌గా ఉండటం విశేషం.

అఫ్జల్‌గంజ్‌లోని గ్రాండ్‌ ఓవెన్‌ బేకరీ/ కేఫ్‌ గ్రాండ్‌ ఓవెన్‌ అనేది ఇరానీ కేఫ్‌ ఆధునిక కేఫ్‌ సంస్కృతుల మేళవింపుగా టేస్టీ చాయ్‌లకు పేరొందింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement