
ఫీజు అడిగిన స్పైస్‌జెట్ ఉద్యోగులపై ఆర్మీ అధికారి దాడి
ఆస్పత్రి పాలైన నలుగురు బాధితులు
న్యూఢిల్లీ: పరిమితికి మించిన లగేజీతో వచ్చినందుకు అదనంగా ఫీజు చెల్లించాలని కోరిన స్పైస్‌జెట్ సిబ్బందిపై ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెలరేగిపోయారు. నలుగురు ఉద్యోగులను చితకబాదడంతో వెన్నెముక విరగడం, దవడ పగలడం వంటి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో జూలై 26వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లెఫ్టినెంట్ కల్నల్ రితేశ్ కుమార్ సింగ్ గుల్మార్గ్‌లోని హై అల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్ పనిచేస్తున్నారు.
ఆయన జూలై 26వ తేదీన ఢిల్లీ వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణించాల్సి ఉంది. క్యాబిన్‌లోకి ప్రయా ణికులు కేవలం 7 కిలోల బరువైన లగేజీని మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. కల్నల్ సింగ్ మాత్రం 16 కిలోల బరువున్న రెండు బ్యాగులతో వచ్చారు. అదనపు బరువుకు నిబంధనల ప్రకారం అదనంగా చార్జీ ఉంటుందని సిబ్బంది చెప్పగా చెల్లించేందుకు నిరాకరించిన సింగ్ ఆగ్రహంతో దుర్భాషలాడుతూ ఊగిపోయారు. వారిని నెట్టేసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై సైన్ బోర్డు స్టీల్ స్టాండుతో దాడికి దిగారు.
SHOCKING “MURDEROUS” Assault on SpiceJet Staffers at Srinagar Airport
Passenger attacks 4 SpiceJet Staffers with whatever he cud get hold off— 2 grievously injured. Jaw & Spine injured.
July 26th incident, FIR Filed
Pax - allegedly an army officer - put on NO FLY List 1/2 pic.twitter.com/g79eiuSy3P— Amit Bhardwaj (@tweets_amit) August 3, 2025
ఒక ఉద్యోగి స్పృహ తప్పి పడిపోగా, ఆయన్ను కాలితో తన్నారు. ముఖంపై పంచ్ ఇవ్వడంతో మరో ఉద్యోగి దవడ ఎముక విరిగింది. ముక్కు నుంచి రక్తం వచ్చింది. మరో ఉద్యోగి వెన్నెముక చిట్లింది. సీఐఎస్‌ఎఫ్ అధికారి కలుగ జేసుకుని ఆయన్ను తిరిగి గేట్ వద్దకు తీసుకెళ్లారు. బాధిత నలుగురు ఉద్యోగులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, దర్యాప్తు చేపట్టామని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామని పేర్కొంది. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిబంధనల ప్రకారం..ఆ అధికారి పేరును నో ఫ్లై జాబితాలో చేరుస్తామని స్పైస్ జెట్ తెలిపింది. ఆ ప్రయాణికుడిపై తగు చర్యలు తీసుకోవాలని పౌరవిమానయాన శాఖకు లేఖ రాసింది.