
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై వెంటనే చర్చించాలని విపక్షాల పట్టు
ఉభయసభలు సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్)పై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పదో రోజు సైతం యథావిధిగా ఆందోళన కొనసాగించాయి. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉభయసభల్లో నిరసనలు, నినాదాలతో హోరెత్తించాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి.
శాంతించాలని, సభా కార్యకలాపాలకు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోకపోవడంతో ఉభయసభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. అంతకుముందు రాజ్యసభలో వెల్‌లోకి దూసుకొచ్చిన ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. దీనిపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ను పారామిలటరీ దళం అదుపులోకి తీసుకుందని మండిపడ్డారు. మరోవైపు లోక్‌సభలో రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ అసెంబ్లీ కానిస్టిట్యూయెన్స్ ఆఫ్ ద స్టేట్ గోవా బిల్లు–2024, ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2025, మర్చంట్ షిప్పింగ్ బిల్లు–2024ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
స్పీకర్ ఓం బిర్లాకు విపక్షాల లేఖ
బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తక్షణమే లోక్‌సభలో ప్రత్యేక చర్చ నిర్వహించాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష సభ్యులు లేఖ రాశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ సవరణ ప్రక్రియ నిర్వహించడంపై వారు అనుమానాలు వ్యక్తంచేశారు. దేశంలో గతం ఇలాంటి పరిణామం ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం సంకేతాలిస్తోందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియ ఉద్దేశం పట్ల సందేహాలున్నాయని వెల్లడించారు. స్పీకర్‌కు రాసిన లేఖపై రాహుల్ గాం«దీ(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), సుప్రియా సూలే(ఎన్సీపీ), లాల్‌జీ వర్మ(సమాజ్‌వాదీ పార్టీ) తదితరులు సంతకాలు చేశారు.
హరివంశ్‌కు మల్లికార్జున ఖర్గే లేఖ
రాజ్యసభలో వెల్‌లో భద్రతా సిబ్బంది తమను అడ్డుకోవడం పట్ల విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అక్కడ సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కనిపించడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ మేరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు ఖర్గే శుక్రవారం లేఖ రాశారు. ప్రజాస్వామ్య పద్ధతితో నిరసన తెలిపే హక్కుకు కాలరాసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. భవిష్యత్తులో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది రాజ్యసభ వెల్‌లోకి రాకుండా నియంత్రించాలని హరివంశ్‌ను కోరారు. పార్లమెంట్ ఉభయసభల లోపల భద్రతపై ప్రభుత్వానికి సంబంధం లేదని, అది సభాపతుల పరిధిలోని అంశమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంచేశారు.