
న్యూస్‌మేకర్
ఒక మోడల్ ఆర్మీ ఆఫీసర్ కావడమంట సౌందర్యం కంటే దేశం ముఖ్యం అనుకోవడమే. 2023లో ‘మిస్ ఇంటర్నేషనల్ ఇండియా’ కిరీటం గెలిచిన కషిష్ మెత్వాని 2024లో ‘కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్’లో 2వ ర్యాంకు సాధించింది. ఏడాది పాటు చెన్నైలో శిక్షణ పొందాక తాజాగా ఆమె లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఆఫీసర్‌గా దేశసేవకై అడుగు ముందుకేసింది. అందాల కిరీటం కన్నా ఆర్మీ యూనిఫామ్ గొప్ప సంతృప్తిని ఇస్తుందంటున్న పూణె అమ్మాయి కషిష్ పరిచయం.
‘ముఝే సబ్‌కుచ్ కర్నా హై’... (నాకు అన్నీ సాధించాలని ఉంది)... ఇదీ కషిష్ మెత్వాని తరచూ చెప్పేమాట. ‘నాకు నచ్చిన పనులన్నీ చేస్తూ సంతోషాన్ని పొందడమే నాకు కావలసింది’ అని కూడా ఆమె చెబుతూ ఉంటుంది.
పుణెకు చెందిన ఈ యువతి చిన్నప్పటి నుంచి సాధించినవి వింటే ఆశ్చర్యం వేస్తుంది. మోడల్‌గా, ‘మిసెస్ ఇంటర్నేషనల్ ఇండియా’ టైటిల్ విన్నర్‌గా గ్లామర్ రంగంలో రాణిస్తుందనుకుంటే ఏకంగా ఆర్మీ ఆఫీసర్‌గా ట్రైనింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ మొదటి వారంలో లెఫ్టినెంట్‌గా ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’లో పని చేయడానికి సిద్ధమైంది. ‘మా ఇంట్లో ఎవరూ ఆర్మీలో పని చేయలేదు. నేనే మొదటిదాన్ని. ఈ పని చాలా కష్టమని తెలుసు. కష్టమైనది సాధిస్తేనే కదా సంతోషం’ అంటోంది.
న్యూరో సర్జన్ కాబోయి..
కషిష్ మెత్వానీది పుణె. ఆమె తండ్రి సైంటిస్ట్‌గా పని చేస్తుంటే తల్లి టీచరుగా ఆర్మీ స్కూల్‌లో పాఠాలు చెప్పేది. ‘మా ఇంట్లో టీవీ ఉండేది. కాని ఏ రోజూ నేను దానిని చూసి టైమ్ వేస్ట్ చేసుకోలేదు. స్కూలు పుస్తకాలు చదవడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం చేసేదాన్ని. నేను ప్రతి పోటీలో పాల్గొని గెలవాలని కోరుకునేదాన్ని. అలాగే గెలిచేదాన్ని కూడా’ అంది కషిష్. చదువులో విశేష ప్రతిభ చూపిన కషిష్ చిన్నప్పుడు న్యూరోసర్జన్ కావాలనుకుంది. కాని స్కూల్లో, ఇంటర్‌లో ఎన్.సి.సిలో చేరడంతో ఆమె ఆలోచనలు మారాయి.
ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఎన్.సి.సి కాడెట్‌గా పాల్గొనడం ఆమె మీద ప్రభావం చూపింది. ఆర్మీలో చేరాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఈలోపు చదువు కొనసాగించి ఎం.ఎస్‌సీ. చేశాక బెంగళూరులో న్యూరోసైన్స్‌లో థీసిస్ సమర్పించింది. ఆ సమయంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చినా తన జీవితం దేశసేవకే అంకితం అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్– 2024 రెండో ర్యాంక్ సాధించింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో శిక్షణ పూర్తయ్యాక ఆఫీసర్‌గా పని చేయడానికి ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’ వింగ్‌ను ఎంచుకుంది.
బహుముఖ ప్రజ్ఞాశాలి
కషిష్ బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువుతూనే పిస్టల్ షూటింగ్ నేర్చుకుంది. వాలీబాల్ ప్లేయర్‌గా ప్రతిభ చాటింది. తబలా నేర్చుకుంది. భరతనాట్యం సాధన చేసింది. అదేవిధంగా గ్లామర్ రంగంలో కూడా తన ఉనికి చాటుకోవడానికి మోడల్‌గా మారింది. అదే సమయంలో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఇవన్నీ 24 ఏళ్లలో సాధించింది. ఆ తర్వాత ఆర్మీ ఆఫీసర్ అయ్యింది. ‘ఇన్ని చేయడానికి కారణం నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించడమే. ఆర్మీ శిక్షణలో కూడా నేను ఎక్కడా తగ్గలేదు. శిక్షణా కాలంలో అనేక పోటీల్లో నేను ఫస్ట్ నిలిచాను’ అంటుంది కషిష్.
సామాజిక సేవలో
ఇన్ని పనులు చేసిన కషిష్ సామాజిక సేవలో కూడా తనదైన కృషి సాగిస్తోంది. ‘క్రిటికల్ కాజ్’ అనే ఎన్.జి.ఓ.ను స్థాపించి అవసరమైన వారికి ΄్లాస్మా, అవయవ దానం వంటి ప్రాణాధార సహాయం అందేలా చేస్తోంది. ‘మన కోసం మనం కష్టపడుతూనే సమాజం కోసం కూడా కష్టపడాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటోంది కషిష్.
నిజంగానే ఆమె ఒక భిన్నమైన ప్రతిభాశాలి.
హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చినా తన జీవితం దేశసేవకే అంకితం అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్– 2024 రెండో ర్యాంక్ సాధించి, శిక్షణ పూర్తయ్యాక ఆఫీసర్‌గా ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’ వింగ్‌ను ఎంచుకుంది కషిష్.