ఫేస్‌బుక్‌ జుకర్‌బర్గ్‌కు మరో తలనొప్పి?

Facebook investors want Zuckerberg to step down as company's chairman following report - Sakshi

వాషింగ్టన్‌: డేటా లీక్‌తో ఇబ్బందుల్లో పడ్డ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ను ఇపుడు మరో సమస్య వేధిస్తోంది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేయాలంటూ వాటాదారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారనే నివేదికలు ఇపుడు ప్రకంపనలు రేపుతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థ, పబ్లిక్‌ అఫైర్స్‌తో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకున్నారన్నవార్తలు  ఇందుకు కారణంగా భావిస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం  చేసిన పెట్టుబడిదారులు జుకర్‌బర్గ్‌ తప్పుకోవాలని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఫేస్‌బుక్‌లో వాటా ఉన్న వైస్ ప్రెసిడెంట్ జానాస్ కూడా జుకర్‌బర్గ్‌ను బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారట.

రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థ, పబ్లిక్‌ అఫైర్స్‌ సంస్థతో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ చేయడంతో జుకెర్‌బర్గ్‌పై ఒత్తిడి పెరిగినట్లు తెలిసింది. ఇది ఇలా ఉంటే ఫేస్‌బుక్‌లో అధిక వాటా ఉన్న ట్రిల్లియం అసెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జొనాస్‌ క్రాన్‌, జుకెర్‌బర్గ్‌ను బోర్డ్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేసారంటూ ది గార్డియన్‌ మరో కథనాన్ని ప్రచురించింది. దీంతో పెట్టుబడిదారులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట.

మరోవైపు ఈ వార్తలను జుకర్‌బర్గ్‌ ఖండించారు. పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ గురించి తనకు తెలియదని, ఆ సంస్థతో తామెప్పుడూ పని చేయలేదని జుకర్‌బర్గ్  స్పష్టం చేశారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ద్వారా మాత్రమే ఈ విషయం గురించి తనకు తెలిసిందన్నారు. దీనిపై తన టీంతో  చర్చించినట్టు తెలిపారు. ఫేస్‌బుక్ సీవోవో శ్రేయాల్ శాండ్‌బర్గ్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తమ కంపెనీపై వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని చెప్పారు.

భారీగా సంపదను కోల్పోయిన జుకర్‌బర్గ్‌
తాజా వివాదంతో శుక్రవారం ఫేస్‌బుక్‌ షేర్లు 3శాతం పడిపోయాయి. షేర్ విలువ 139.53 డాలర్లకు పడిపోవడంతో 2017 ఏప్రిల్‌ తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయిగా నిలిచింది. రష్యా ఎన్నికల్లో జోక్యం, డేటా లీక్‌తోపాటు తాజా వివాదం నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 17.4 బిలియన్‌ డాలర్లను కోల్పో‍యింది. అలాగే జుకర్‌బర్గ్‌ సంపద ఇప్పుడు 55.3 బిలియన్‌ డాలర్ల వద్ద ఉంది. జూలై 25నుండి ఆయన 31 బిలియన్ డాలర్లకు పైగా సంపదను కోల్పోయారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top