కండలు కరిగిస్తే సూపర్‌ మెమొరీ | Sakshi
Sakshi News home page

కండలు కరిగిస్తే సూపర్‌ మెమొరీ

Published Thu, Nov 23 2017 11:15 PM

exercise is helpful for memory power - Sakshi - Sakshi

టొరంటో: ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మంచి ఆరోగ్యంతోపాటు నిత్య నూతనంగా, యవ్వనంగా ఉంటామని మన అందరికీ తెలుసు. అయితే అధికశ్రమతో కూడిన వ్యాయామం చేయడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని కాగ్నిటివ్‌ న్యూరోసైన్స్‌ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి వయసు పెరిగేకొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోయి డిమెన్షియా, అల్జీమర్స్‌ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చిన్నపిల్లలు, యువతను సైతం ఈ మతిమరపు వ్యాధులు వదలడం లేదు.

అయితే ఈ మతిమరపునకు విరుగుడు చెమటలు కక్కేలా వ్యాయామం చేయడమేనంటున్నారు కెనడా పరిశోధకులు. పరిశోధనలో భాగంగా వారు ఆరు వారాల పాటు ప్రతిరోజూ వ్యాయామం చేసిన 95 మందిపై అధ్యయనం చేశారు. అనంతరం వారికి ప్రజ్ఞా పరీక్షలు నిర్వహించారు. వారిలో శిక్షణకు ముందుకంటే అధికంగా ప్రజ్ఞా శక్తి పెరిగినట్లు గుర్తించారు. వారి మతిమరపు ఇంత తొందరగా తగ్గడానికి కారణం తీవ్రశ్రమతో కూడిన వ్యాయామం చేయడమేనని తేల్చారు. వ్యాయామం కారణంగా వారి మెదడులో ఓ ప్రోటీన్‌ అధికంగా ఉత్పత్తి కావడాన్ని గమనించామని, దీని వల్ల మెదడులోని కణాలు చురుకుగా వ్యవహరించి, వారి ప్రజ్ఞాశక్తిని పెంపొందించాయని చెప్పారు. 

Advertisement
Advertisement