ముంచుకొస్తున్న కరువు | el nino may cause heavy draught in india | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న కరువు

Feb 23 2014 2:53 AM | Updated on Sep 2 2017 3:59 AM

ముంచుకొస్తున్న కరువు

ముంచుకొస్తున్న కరువు

భారత్‌కు మళ్లీ కరువు ముప్పు ముంచుకొస్తోంది. దేశంలో గత నాలుగేళ్లుగా వర్షాలను సమృద్ధిగా కురిపించిన రుతుపవనాలు ముఖం చాటేయనున్నాయి.

 సింగపూర్: భారత్‌కు మళ్లీ కరువు ముప్పు ముంచుకొస్తోంది. దేశంలో గత నాలుగేళ్లుగా వర్షాలను సమృద్ధిగా కురిపించిన రుతుపవనాలు ముఖం చాటేయనున్నాయి. ఈ ఏడాది నుంచి మళ్లీ వర్షాభావంతో పంటలపై తీవ్ర ప్రభావం పడనుంది. వరి, గోధుమ, చెరకు ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉన్న భారత్ ఆ పంటల దిగుబడులు తగ్గి కరువును ఎదుర్కోనుంది. పసిఫిక్ మహా సముద్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి ‘ఎల్ నినో’ వాతావరణ పరిస్థితులు ఏర్పడనుండటమే ఈ గడ్డు కాలానికి కారణం కానుంది. ఈ ఏడాది రెండో సగం నుంచి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ‘బ్యూరో ఆఫ్ మెటియరాలజీ’, అమెరికాకు చెందిన ‘యూఎస్ క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్’ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

ఈ ఎల్ నినోతో భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా తీర ప్రాంతాలు, ఆఫ్రికాలోనూ తీవ్ర కరువు ఏర్పడనుంది. అదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియా, తదితర ప్రాంతాలు, బ్రెజిల్ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఎల్ నినో తీవ్రతపై వాదనలు కొనసాగుతున్నాయని, దీనిని తీవ్రమైనదిగా నిర్ధారిస్తే గనక.. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడి వివిధ సరుకుల ధరలు కూడా నింగినంటుతాయని అంటున్నారు.
 ఇంతకుముందు 2009లో ఏర్పడిన ఎల్ నినో వల్ల.. భారత్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా నాలుగు దశాబ్దాల్లోనే అతిపెద్ద కరువును దేశం చవిచూడాల్సి వచ్చింది. చక్కెర ధరలు సైతం 30 ఏళ్లలో అత్యధికంగా పెరిగాయి.
 1990లలో తీవ్ర ఎల్ నినో వల్ల ఏర్పడిన కరువుకు వివిధ దేశాల్లో 2 వేల మంది మృత్యువాతపడ్డారు. వందల కోట్ల డాలర్ల నష్టం సంభవించింది.
 ప్రస్తుత ఎల్ నినో వల్ల థాయిలాండ్, ఇండోనేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, చైనా దేశాల్లో వరి, కాఫీ, మొక్కజొన్న పంటలు కరువుతో ఎండిపోనున్నాయి.
 వరదలు రావడం లేదా రవాణాకు ఆటంకం కలగడం వల్ల బంగారం, నికెల్, టిన్, కాపర్ (రాగి), బొగ్గు వంటి ఖనిజాల ధరలూ భారీగా పెరిగే అవకాశమూ ఉంది.
 
 ఎల్ నినో.. ‘బ్యాడ్’బోయ్!

 స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే బాలుడు అని అర్థం. పసిఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా  పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితినే ఎల్ నినోగా పిలుస్తారు. ఇది ప్రతి 4 నుంచి 12 ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ ఎల్ నినో-దక్షిణ డోలనం అనే సహజ వాతావరణ వలయంలో భాగంగా జరుగుతుంది. ఎల్ నినో వల్ల రుతుపవనాలు ప్రభావితమై ఆయా దేశాల్లో తీవ్ర కరువు ఏర్పడే ముప్పు ఉంటుంది కాబట్టి.. దీనిని బ్యాడ్ బోయ్‌గా అభివర్ణిస్తారు. ఇది ముఖ్యంగా మనదేశంలో నైరుతి రుతుపవనాలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అలాగే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా తగ్గి.. ఎల్ నినోకు వ్యతిరేక ంగా ఏర్పడే వాతావరణ పరిస్థితిని ‘లా నినా’(స్పానిష్‌లో లిటిల్ గర్ల్)గా పిలుస్తారు. దీని వల్ల అమెరికా, తదితర చోట్ల కరువు ఏర్పడుతుంది. భారత్, ఆస్ట్రేలియా, తదితర దేశాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement