పిచ్చి రాతలు.. పచ్చి అబద్ధాలు | Sakshi
Sakshi News home page

పిచ్చి రాతలు.. పచ్చి అబద్ధాలు

Published Thu, Jan 12 2017 2:40 AM

పిచ్చి రాతలు.. పచ్చి అబద్ధాలు - Sakshi

మీడియాపై ట్రంప్‌ ఫైర్‌
రష్యా వద్ద తన రహస్య సమాచారముందన్న వార్తలపై..

న్యూయార్క్‌: రష్యా వద్ద తనను ఇబ్బంది పెట్టే సమాచారం ఉందని వచ్చిన కథనాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. ‘అదంతా కట్టుకథ. నాపై ఆరోపణలు అవమానకరం. మానసిక రోగులు, నా వ్యతిరేకులు కలసి చేసిన పని’ అని విమర్శించారు. తనపై ఆరోపణలను అమెరికా నిఘా సంస్థలు మీడియాకు లీక్‌ చేసి ఉండొచ్చని, అదే నిజమైతే వాటి చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. 9 రోజుల్లో అధ్యక్ష పదవి చేపట్టనున్న ట్రంప్‌ ఆరు నెలల విరామం తర్వాత తొలిసారి బుధవారమిక్కడ కుటుంబ సభ్యుల సమక్షంలో కిక్కిరిసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచాక ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లడం ఇదే తొలిసారి. 

(చదవండి :పుతిన్ చేతిలో ట్రంప్ జుట్టు? )

‘నాపై పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని చూశా, చదివా.. అవన్నీ పిచ్చిరాతలు.. పచ్చి అబద్ధాలు..’ అని ట్రంప్‌ అన్నారు. అయితే రష్యాతోపాటు కొన్ని దేశాలు డెమోక్రటిక్‌ పార్టీ నేషనల్‌ కమిటీ కంప్యూటర్లను హ్యాక్‌ చేశాయన్నది నిజమేనని, అవి రిపబ్లికన్‌ పార్టీ నేషనల్‌ కమిటీ కంప్యూటర్లలోకి మాత్రం చొరబడలేకపోయాయని చెప్పారు. ట్రంప్‌ను ఇబ్బందిపెట్టే, రష్యాలో  వేశ్యలతో ఆయనవిశృంఖల శృంగారం తదితరాలను రష్యా సేకరించిందన్న నివేదికల సారాంశాన్ని అమెరికా నిఘా సంస్థల అధిపతులు ఆయనకు, దేశాధ్యక్షుడు ఒబామాకు తెలిపారని వార్తలు రావడంతో ట్రంప్‌ స్పందించారు.

ఆ సమాచారంతా కల్పితమనిు పుతిన్‌ చెప్పారన్నారు. ‘రష్యాతో నాకు సంబంధాల్లేవు. పుతిన్‌ నన్ను ఇష్టపడుతున్నారంటే సానుకూలాంశమే’ అని అన్నారు.  సీఎన్‌ఎన్‌ విలేకరి ఒకరు ఓ ప్రశ్న వేయబోగా.. ‘మీవన్నీ తప్పుడు వార్తలు.. రాసిందంతా చెత్త’ అని గట్టిగా అరిచారు. కాగా ‘గతంలో ఎవరూ సృష్టించనన్ని ఉద్యోగాలు సృష్టిస్తా..అక్రమ వలసదారులు దేశంలోకి రాకుండా మెక్సికో సరిహద్దులో భారీ గోడ కడతాం. ’ అని ట్రంప్‌ చెప్పారు. తన వ్యాపార బాధ్యతలను  ఇద్దరు కొడుకులకు అప్పగించానని వెల్లడించారు.

వివాదమిదీ..
న్యూఢిల్లీ: ట్రంప్‌ రహస్య, అభ్యంతరకర సమాచారం రష్యా వద్ద ఉందని, దీంతో ట్రంప్‌ను రష్యా వాడుకుంటోందని అమెరికా నిఘా సంస్థల నివేదిక పేర్కొంది.అయితే తమ వద్ద ట్రంప్‌కు సంబంధించిన ఏ అభ్యంతరకర సమాచారమూ లేదని, అమెరికాతో తమ సంబంధాలను దెబ్బ తీయడానికే ఈ వార్తలు తెరపైకి తెచ్చారని రష్యా స్పష్టం చేసింది.  నివేదికలో ‘ట్రంప్‌– రష్యా’ సంబంధాలు వివరంగా ఉన్నాయని వార్తలొచ్చాయి. ట్రంప్, హిల్లరీల ప్రతిష్టను దెబ్బతీసేS సమాచారం రష్యా వద్ద ఉందని,  హిల్లరీని దెబ్బతీసే ఉద్దేశంతో.. ఎన్నికల సమయంలో రష్యా ఆమెకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే బహిర్గతం చేసిందని∙అమెరికా ఉన్నతాధికారి అన్నారు. ప్రచార సమయంలో ట్రంప్‌ వర్గీయులు, రష్యా మధ్యవర్తుల మధ్య సమాచార మార్పిడి జరిగిందని  నివేదికలో ఉందన్నారు.

Advertisement
Advertisement