పేగుల్లోని బ్యాక్టీరియా మారితే చిక్కే 

 Differences in bacterial types in the stomach and intestines - Sakshi

వయసుతో పాటు వచ్చే కొన్ని వ్యాధులకు మన కడుపు, పేగుల్లోని బ్యాక్టీరియా రకాల్లో తేడాలు రావడమే కారణమా అంటే అవునంటున్నారు శాస్త్రవేత్తలు. వయసులో ఉండే ఎలుకల బ్యాక్టీరియాను వయసు మీరిన ఎలుకల కడుపులోకి ప్రవేశపెట్టినప్పుడు వాటిల్లో వయసు సంబంధిత వాపు లేదా మంట పెరిగినట్లు తేలిందని నెదర్లాండ్స్‌కు చెందిన గ్రాంజియన్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వాపు అలాగే కొనసాగితే గుండెపోటు, ఇతర గుండె జబ్బులు, మతిమరుపు వంటి సమస్యలొస్తాయని అంటున్నారు. వయోవృద్ధులు తమ ఆహారాన్ని తగినట్లు మార్చుకోవడం ద్వారా కొన్ని సమస్యలను అధిగమించవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రయోగాలు చేసినట్లు పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్‌ ఫ్లోరిస్‌ ఫ్రాన్సన్‌ తెలిపారు.

కడుపు, పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను అభివృద్ధి చేసుకుంటూ చెడు బ్యాక్టీరియాను తగ్గించుకుంటే వయసు మీదపడ్డా కూడా ఆరోగ్య సమస్యలు పెద్దగా బాధించవని పేర్కొన్నారు. ఇందుకోసం మొక్కల ద్వారా లభించే పీచుపదార్థాలు (ఉల్లి, వెల్లుల్లి, అరటి, బార్లీ, ఓట్స్‌ ఆపిల్స్, అవిశ గింజలు వంటివి) ఎక్కువగా తీసుకోవడం, పెరుగు, మజ్జిగ, ఊరగాయల వంటి ప్రో బయోటిక్స్‌ను ఆహారంలోకి చేర్చుకోవడం ద్వారా వాపును.. తద్వారా భవిష్యత్తులో రాగల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని వివరించారు. వయసు మళ్లిన తర్వాత పేగుల్లోని బ్యాక్టీరియాలో తేడా ఎందుకు వస్తుందన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదని, యాంటీ బయోటిక్స్‌ పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top