సీటెల్‌లో ‘కోవిడ్‌-19’ క్లినికల్‌ ట్రయల్స్‌!

Covid 19 Vaccine Ready For Clinical Trials in Seattle USA - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌)కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు శాయశక్తులా కృషి చేస్తున్నారు. పూర్తిస్థాయిలో వైరస్‌ను నాశనం చేయలేకపోయినా... దానిని ఎదుర్కొనేలా రోగనిరోధక శక్తి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కైజర్‌ పర్మనెంటే వాషింగ్టన్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు... తాము కనిపెట్టిన వ్యాక్సిన్‌తో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతులను ఎంచుకుని.. వారిపై వ్యాక్సిన్‌ ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 45 మందిని మూడు గ్రూపులుగా విభజించి.. సీటెల్‌లో ఈ మేరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 14 నెలల్లో రెండు సార్లు వారికి వ్యాక్సిన్‌ ఇంజెక్ట్‌ చేస్తామని.. అయితే అందరికీ ఒకే డోసు ఇవ్వకుండా వారి రోగనిరోధక వ్యవస్థ పనితీరును పరిశీలిస్తామని తెలిపారు. (కరోనా వైరస్‌తో మృతులు లక్షల్లో ఉండొచ్చు! )

కాగా మెడెర్నాటీఎక్స్‌ సంస్థ సహాయ సహకారాలతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌కు.. కరోనా వైరస్‌ను బలహీనపరిచే లేదా అంతమొందించే శక్తి లేదని.. కేవలం అది దరిచేరకుండా తమ చుట్టూ ప్రోటీన్‌ను నిర్మించుకునేలా శరీరంలోని కణాలను ఉత్తేజితం చేసేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించారు. తద్వారా రోగనిరోధ శక్తి పెరిగి కరోనాను ఎదుర్కో గల సామర్థ్యం పెంపొందుతుందని తెలిపారు. గతంలో వ్యాప్తిచెందిన జికా వైరస్‌, హ్యూమన్‌ మోటాప్నం వైరస్‌లను నిరోధించడానికి ఉపయోగించిన వ్యాక్సిన్‌ మాదిరే ఇది కూడా పనిచేస్తుందని.. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనాలకునేవారు తమను సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు. దీని ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ ఉండవని పేర్కొన్నారు.(కరోనాను జయించి బయటకు వచ్చారు..)

ఇక చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడిన కరోనా వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా గురువారం నాటికి 95,000 మంది ప్రజలకు వైరస్‌ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు ఈ వైరస్‌ వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్‌ వ్యాప్తి, చైనాలో కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. భారత్‌లోనూ కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోంది. (కరోనా అలర్ట్‌: కేంద్ర సిబ్బంది శాఖ కీలక నిర్ణయం!)

కరోనా కల్లోలం.. అలర్ట్‌: వరుస కథనాల కోసం క్లిక్‌ చేయండి!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top