సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం: చైనా | China Says Not To Underestimate Their Firm Amid Ladakh Face Off | Sakshi
Sakshi News home page

మా ఆర్మీని తక్కువగా అంచనా వేయకండి: చైనా

Jun 18 2020 8:40 PM | Updated on Jun 18 2020 9:27 PM

China Says Not To Underestimate Their Firm Amid Ladakh Face Off - Sakshi

బీజింగ్‌: సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా చర్చలకు సిద్ధమంటూనే చైనా పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. గాల్వన్‌ లోయ ప్రాంతం తమదేనని ఆ దేశ మిలటరీ అధికారులు సహా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్‌ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా సోమవారం నాటి ఘర్షణలకు భారత సైన్యమే కారణమంటూ ఆరోపణలు చేశారు. తాజాగా చైనా విదేశాంగ శాఖ సమాచార విభాగం డైరెక్టర్‌ జనరల్‌ హువా చునింగ్‌ కూడా అదే రాగం ఆలపించారు. గాల్వన్‌ లోయలో చైనా సైనికుల ఘాతుకాన్నిభారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ తీవ్ర స్థాయిలో ఖండించిన నేపథ్యంలో గురువారం ట్విటర్‌ వేదికగా భారత ఆర్మీపై ఆమె అక్కసు వెళ్లగక్కారు.(చైనాకు రైల్వే శాఖ షాక్‌.. ఒప్పందం రద్దు!)

ఈ మేరకు.. ‘‘ఇరు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని ఉల్లంఘించి భారత బలగాలు వాస్తవాధీన రేఖ దాటాయి. ఉద్దేశపూర్వకంగానే చైనా అధికారులు, సైనికులపై దాడులు చేశాయి. భౌతిక దాడుల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి’’ అని భారత సైన్యంపై అసత్య ప్రచారానికి పూనుకున్నారు. అదే విధంగా చైనా ఆర్మీని తక్కువగా అంచనా వేయొద్దని... దేశ సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని వ్యాఖ్యానించారు.

కాగా గాల్వన్‌ లోయ ప్రాంతంలో సోమవారం రాత్రి భారత జవాన్లపై డ్రాగన్‌ ఆ‍ర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇసుక రాడ్లు, మారణాయుధాలతో దాడి చేసినట్లు ఘటనాస్థలంలో ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ ఘర్షణకు చైనా వ్యవహరించిన తీరేన కారణమని పేర్కొంది. క్షేత్రస్థాయిలో మార్పులు చేయాలన్న ముందస్తు ప్రణాళికతోనే డ్రాగన్‌ ఇలా వ్యవహరించిందని, ఇది గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement