
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడఖ్‌లో శుక్రవారం భారత జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ చైనాపై విరుచుకుపడటం పట్ల పొరుగు దేశం స్పందించింది. తమను ఉద్దేశించి మోదీ చేసిన విస్తరణవాద దేశాలనే వ్యాఖ్యలపై డ్రాగన్ బదులిచ్చింది. చైనా తన 14 పొరుగు దేశాల్లో 12 దేశాలతో శాంతియుత సంప్రదింపుల ద్వారా సరిహద్దు రేఖలను నిర్ధారించిందని, భౌగోళిక సరిహద్దులను స్నేహపూర్వక సహకారానికి అనుబంధంగా మార్చిందని వ్యాఖ్యానించింది. చైనాను విస్తరణ కాంక్ష కలిగిన దేశంగా పేర్కొనడం నిరాధారం, అతిశయమని అభివర్ణించింది. ఈ వ్యాఖ్యల ద్వారా పొరుగుదేశంతో భారత్ తమ వివాదాలను పెంచుకోవడమేనని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జి రోంగ్ అన్నారు.
కాగా, అంతకుముందు భారత జవాన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ విస్తరణ కాంక్షకు కాలం చెల్లిందని, ఇది అభివృద్ధి యుగమని డ్రాగన్‌కు చురకలంటించారు. విస్తరణవాదులు ఓడిపోయి తోకముడిచిన ఘటనలు చరిత్రలో చోటుచేసుకున్నాయని చెప్పారు. భారత్ శాంతి యత్నాలకు స్పందించని చైనాపై మండిపడుతూ బలహీనులే శాంతి కోసం చొరవచూపరని ధైర్యవంతులే శాంతి కోసం పాటుపడతారని వ్యాఖ్యానించారు.భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసునన్నారు. భారత్‌లో లడఖ్ అంతర్భాగమని స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో జవాన్లు దేశానికి రక్షణగా ఉన్నారని, శత్రువులకు భారత సైనికులు గట్టి గుణపాఠం చెప్పారని ప్రశంసించారు. చదవండి : సరిహద్దు నుంచి యుద్ధ సందేశం