ఇలా కూడా కేసు పెడతారా?

Canadian Woman Fined For not Holding Escalator Handrail - Sakshi

మీరెప్పుడైనా ఎస్కలేటర్‌ ఎక్కారా.. ఎక్కితే గ్రిప్‌ కోసం పక్కన హ్యాండ్‌రైల్‌ ఉంటుంది కదూ. దాన్ని పట్టుకుని వెళితే సురక్షితంగా దిగొచ్చు కదా.. అదే విషయాన్ని అక్కడ సైన్‌ బోర్డులపై కూడా రాస్తుంటారు. అయితే కొందరు దాని సాయం లేకుండా వెళ్తుంటారు. అలవాటు ఉంటే పెద్ద సమస్యేమీ కాదు. పెద్ద నేరమేమీ కాదు. కానీ కెనడాలో మాత్రం ఓ రకంగా నేరమే. ఓ మహిళ దీనిపై ఏకంగా పదేళ్లుగా పెద్ద పోరాటమే చేశారు. అది 2009. కెనడా లావల్‌లోని ఓ సబ్‌వేలో బెలా కోసియాన్‌ అనే మహిళ ఎస్కలేటర్‌ ఎక్కారు. ఆ ఎస్కలేటర్‌ ముందు ‘హ్యాండ్‌రైల్‌ను పట్టుకోండి’అని ఓ బోర్డుపై రాసి ఉంది. అదే విషయాన్ని ఓ పోలీస్‌ అధికారి ఆమెకు చెప్పాడు.

అయితే ఆమె దాన్ని పట్టించుకోలేదు. పైగా అధికారితో వాదనకు దిగారు. ఎస్కలేటర్‌ హ్యాండ్‌రైల్‌ను పట్టుకోనందుకు రూ.7 వేలు, ఆమె వివరాలు చెప్పనందుకు మరో రూ.23 వేలు ఫైన్‌ వేశాడు ఆ పోలీస్‌ అధికారి. అంతేకాదు ఓ 30 నిమిషాల పాటు జైలులో ఉంచారు. దీనిపై ఆమె అక్కడి ఓ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే రెండు కోర్టులలో కేసు ఓడిపోయారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతూనే ఉన్నారు. ఆ కోర్టు.. ఈ కోర్టు తిరుగుతూ చివరికి కెనడా సుప్రీం కోర్టును చేరింది ఆ కేసు. చివరికి ఆమెకు అనుకూలంగానే తీర్పు వెలువడింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top