ఇంట్రెస్ట్‌ ఉందా? మీ పంట పండిందే! | California Young Farmers invented solar crop box kit | Sakshi
Sakshi News home page

ఇంట్రెస్ట్‌ ఉందా? మీ పంట పండిందే!

Dec 30 2016 3:54 AM | Updated on Oct 1 2018 3:56 PM

ఇంట్రెస్ట్‌ ఉందా? మీ పంట పండిందే! - Sakshi

ఇంట్రెస్ట్‌ ఉందా? మీ పంట పండిందే!

కొంచెం భూమి ఉండి, అనుభవం లేకున్నా.. వ్యవసాయం చేయాలన్న ఆసక్తి ఉన్నవాళ్ల కోసం కొత్తగా టూల్‌ బాక్స్‌ ఒకటి వచ్చింది!

వావ్ ఫ్యాక్టర్

కొంచెం భూమి ఉండి, అనుభవం లేకున్నా.. వ్యవసాయం చేయాలన్న ఆసక్తి ఉన్నవాళ్ల కోసం కొత్తగా టూల్‌ బాక్స్‌ ఒకటి వచ్చింది! ‘కిట్‌’ లాంటిదన్నమాట! పొలంలో దాన్నో మూల బిగించుకుని 150 మందికి ఏడాదికి సరిపడా తిండిగింజల్ని, కాయగూరల్ని పండించవచ్చు. మార్కెటింగ్‌ చేసుకునే వరకు నిల్వ ఉంచుకోవచ్చు. విత్తనాలు నాటడానికి, నీళ్లు పెట్టడానికి, ఎరువు వెయ్యడానికి, కలుపు తియ్యడానికి, కోత కొయ్యడానికి అవసరమైన పరికరాలన్నీ ఈ కిట్‌లోనే ఉంటాయి. అవన్నీ కూడా సోలార్‌ శక్తితోనే నడుస్తాయి. ఈ పరికరాలను ఎలా ఉపయోగించాలి, పొలంలో ఎలా బిగించాలి, ఎలా సమన్వయం చేసుకోవాలి, అధిక దిగుబడులను ఎలా సాధించాలి, చీడపీడల్ని ఎలా నివారించాలి.. అనే విషయాల్నీ క్షుణ్ణంగా తెలుసుకోవడానికి కిట్‌ లోపల సూచనలు, సలహాల సిస్టమ్‌ ఉంటుంది.



కిట్‌ అంటే చేతిలో పట్టేలా ఉండదు. అదొక పెద్ద షిప్పింగ్‌ కంటెయినర్‌. కాలం తీరిన నౌకల బాడీ పార్ట్‌ల జోడింపే ఈ పంటల కంటెయినర్‌. పొలంలో ఓ మూల ఈ కంటెయినర్‌ను గూడులా అమర్చుకోవచ్చు. అందులో నివాసం ఉంటూ, పొలం పనులు, బాగోగులు చూసుకోవచ్చు. గూడు లోపలి నుంచి పొలంలోకి డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో మొక్కల కుదుళ్లకు మాత్రమే నీరు అందేలా పైపులు ఏర్పాటు చేసుకోవచ్చు.  వైఫై సదుపాయం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు బయటి నుంచే రిమోట్‌ ద్వారా పంటను పర్యవేక్షించుకోవచ్చు. సంరక్షించుకోవచ్చు. కాపు కాసుకోవచ్చు. బ్రాండీ డికార్లీ, స్కాట్‌ థాంప్సన్‌ అనే కాలిఫోర్నియా యువ టెక్నో రైతులు ఇద్దరు కలసి ఈ కిట్‌ను రూపొందించారు. కెన్యాలో ఓ యూత్‌ సెంటర్‌లో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి ఒక కిట్‌ను కనిపెడితే మానవాళికి ఇంత ముద్ద పెట్టిన వాళ్లమవుతామన్న ఆలోచన వచ్చిందట వీళ్లకు. ఫలితమే ఈ కిట్‌ ఆవిర్భావం. ప్రపంచంలో దాదాపు 100 కోట్ల జనాభా ఆకలితో, పేదరికంతో అలమటిస్తోందని అంచనా. ఈ పంట కిట్‌ల వాడకం వల్ల భూమి సస్యశ్యామలమై అందరికీ ఆహారం అందుతుందని ఈ ఇద్దరు మిత్రులు అంటున్నారు. కిట్‌ ఖరీదు 50 వేల డాలర్లు. సుమారు 34 లక్షల రూపాయలు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement