పిల్లల పొలం బడి | Farms and Food for Kids, Learn how food comes from a farm to your table | Sakshi
Sakshi News home page

పిల్లల పొలం బడి

May 5 2026 5:23 AM | Updated on May 5 2026 5:23 AM

Farms and Food for Kids, Learn how food comes from a farm to your table

కిడ్స్‌ కార్నర్‌

మీరెప్పుడైనా పచ్చని పంట పొలాల దగ్గరకి వెళ్లారా? వ్యవసాయం గురించి ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగితే... మీలాంటి పిల్లలలో చాలామంది చెప్పే జవాబు...
‘వెళ్లలేదు’... ‘తెలియదు’ పాలు ఎక్కడినుంచి వస్తాయి? ఒక అమ్మాయిని ఎవరో అడిగారట... ‘పాలు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని! దానికి ఆ పాప... ‘టెట్రా ప్యాక్‌లో నుంచి వస్తాయి’ అని చెప్పిందట!

ఇది విన్న ఆ పాప తండ్రి కిరుబ శంకర్‌ ఆశ్చర్యపోయారు. కిరుబ శంకర్‌ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పుడు ఆయనకు పంటపొలాలు మరో స్కూల్‌. స్కూల్‌ అయిపోగానే అక్కడికి పరుగెత్తుకు వెళ్లేవాడు. గొర్రెలతో, మేకలతో ఆడుకునేవాడు. అతడికి  చిన్నప్పటి నుంచి వ్యవసాయం గురించి చాలా విషయాలు తెలుసు.

వెల్‌కమ్‌ టు వక్సాన ఫార్మ్స్‌
మరేమో, మీ తరం పిల్లల విషయానికి వస్తే... చాలా మందికి వ్యవసాయం గురించి బొత్తిగా తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శంకర్‌ అంకుల్‌ తమిళనాడులోని రెట్టనై గ్రామంలో మీలాంటి పిల్లల కోసం వ్యవసాయ ప్రపంచాన్ని క్రియేట్‌ చేశారు. పద్నాలుగు ఎకరాల ఈ వ్యవసాయ క్షేత్రం (వక్సాన ఫార్మ్స్‌)లోకి మీరు అడుగుపెడితే వ్యవసాయం గురించి సమస్త విషయాలు తెలుసుకోవచ్చు. ‘వక్సాన’ అంటే పచ్చదనంతో నిండిన సారవంతమైన భూమి అని అర్థం.

ఎంచక్కా... విత్తనాలు నాటవచ్చు, పొలం దున్నవచ్చు...
‘వక్సాన ఫార్మ్స్‌’లో పంటలు, రకరకకాల చెట్లు, జంతువులు, కాలువలు... ఎన్నో ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకోవచ్చు. పొలంలోనే మధ్యాహ్నం భోజనం వడ్డిస్తారు. భోజనం తరువాత కొద్దిసేపు విశ్రాంతి. ఆ తరువాత జంతుప్రపంచంలోకి తీసుకువెళతారు. అక్కడ గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటె... మొదలైన వాటితో పాటు బాతులు, హంసలు, టర్కీలు ఉంటాయి.

‘జంతువులు, వ్యవసాయం వేరు కాదు’ అంటూ వ్యవసాయ ప్రపంచంలో జంతువుల ప్రాముఖ్యం, కష్టం గురించి తెలియజేస్తారు. మీలాంటి పిల్లలకు ఇప్పుడు ఈ  ‘ఫార్మ్‌ క్యాంప్‌’  ఫెవరెట్‌ స్పాట్‌ అయింది. ఈ ‘ఫార్మ్స్‌ క్యాంప్‌’లో మీరు ఒక రోజు పూర్తిగా గడపవచ్చు.

పొలం దున్నడం, సాగు కోసం భూమిని ఎలా సిద్ధం చేస్తారో తెలుసుకోవడం, విత్తనాలు నాటడం, కలుపు తీయడం, ట్రాక్టర్‌ సవారీలు... ఇలా ఎన్నో ఉంటాయి. ఈ పనులన్నీ మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎద్దులను ఉపయోగించి చేసే సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కూడా మీకు ఇక్కడ పరిచయం చేస్తారు. ఆధునిక వ్యవసాయానికి, ఒకప్పటికి వ్యవసాయానికి తేడా ఏమిటో వివరంగా చెబుతారు. పిల్లలు వాటికి ఆహారం పెడతారు. వాటి ప్రవర్తనను దగ్గరి నుంచి గమనిస్తారు. పొలం పనులకు అవి ఎలా ఉపయోగపడుతాయో ప్రత్యక్షంగా చూస్తారు.

రాత్రి ఆరు బయట భోజనం... ఆ తరువాత కథలు
సాయంత్రం కావడానికి ముందు పొలానికి దగ్గరలోని చెరువులో పిల్లలు ఈత కొడతారు. పంపు సెట్‌ల కింద స్నానం చేస్తారు. పొలాల్లో నడుస్తూ, కూరగాయలు కోసి రాత్రి భోజనానికి ఏమి వండాలో చెబుతారు. తల్లిదండ్రులు, అక్కడ ఉన్నవారితో కలిసి వంట చేస్తారు. రాత్రి భోజనాన్ని ఆరుబయట వడ్డిస్తారు. ఆ తరువాత మంట చుట్టూ చేరి కథలు చెప్పుకుంటారు.  

ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీలాంటి పిల్లలు రైతు జీవితాన్ని గడపవచ్చు. మీరు ఒకరోజు పొలంలో పనిచేయడం వల్ల వ్యవసాయం గురించి మాత్రమే కాదు పర్యావరణం గురించి కూడా తెలుసుకోవచ్చు. బంబరం, తాయంబాస్, కిట్టి పుల్, ఉరియడిలాంటి సంప్రదాయ గ్రామీణ ఆటలను, వ్యాయామాలను పరిచయం చేస్తారు. ‘పిల్లలు భవిష్యత్‌లో తల్లిదండ్రులవుతారు. వారు ఇక్కడ పొందిన అనుభవం వారి భవిష్యత్‌కు బాగా ఉపయోగపడుతుంది’ అంటున్నారు కిరుబ శంకర్‌.

24 గంటలు
ప్రతి క్యాంపులో పదిమంది పిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఫార్మ్‌క్యాంప్‌లో ఏప్రిల్, మే నెలలో క్యాంప్‌లు నిర్వహిస్తారు. మేలో జరిగేవి... 9–10 మే, 16–17 మే, 30–31 మే. కార్యక్రమాలు శనివారం ఉదయం పదిగంటల నుండి ఆదివారం ఉదయం పది గంటల వరకు జరుగుతాయి.

vaksanafarms.in/special/
summer-camp/

– యాకూబ్‌

Advertisement
 
Advertisement
Advertisement