400 మంది ముస్లింలు ఊచకోత

400 మంది ముస్లింలు ఊచకోత


సాక్షి, రఖైన్‌: సుగంధ ద్రవ్యాల సువాసనలతో అలరారే మయన్మార్‌ మట్టి రోహింగ్యా ముస్లింల నెత్తురుతో తడిసింది. రఖైన్‌ రాష్ట్రంలో మొదలైన హింసాకాండ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. తాజాగా ఆర్మీ పోస్టులపై రోహింగ్యా మిలిటెంట్లు విరుచుకుపడటంతో వారిని అడ్డుకునేందుకు ఆర్మీ నరమేధానికి దిగాల్సివచ్చింది. మత ఘర్షణల్లో సుమారు 400 మంది రోహింగ్యా ముస్లింలు మరణించినట్లు ఆ దేశ సైనికాధిపతి మిన్‌ ఆంగ్‌ హ్లెయింగ్‌ కార్యాలయం తెలిపింది. మయన్మార్‌లో అత్యధికులు బౌద్ధ మతస్థులు. ఆ దేశంలో నివసించే రోహింగ్యా ముస్లింల సంఖ్య చాలా తక్కువ(మైనారిటీ). దేశంలో ఉన్న రోహింగ్యా ముస్లింలలో అత్యధికులు రఖైన్‌ రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు.



బర్మాలో బౌద్ధులకు, రోహింగ్యా ముస్లింలకు మధ్య విభేదాలు కొత్తవేమీ కాదు. గత ఐదేళ్లుగా ఈ మత పరమైన సంక్షోభం బర్మాలో కొనసాగుతూనే ఉంది. సైన్యం, రోహింగ్యా ముస్లింల మధ్య జరుగుతున్న మారణహోమంలో రఖైన్‌ రాష్ట్రంలో వందల కొద్దీ గ్రామాలు తగులబడిపోయాయి. ఎంతలా అంటే వాటి ఆనవాళ్లు కూడా తెలుసుకోలేనంతలా. సైన్యం మీద కక్ష్యతో రోహింగ్యా మిలిటెంట్లు మారుమూల గ్రామాలకు నిప్పు పెడితే.. సైనికులు రోహింగ్యా ముస్లింలు దాగి ఉన్నారనే ఆరోపణలతో గ్రామాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. దీంతో వణికిపోతున్న సామాన్య రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు పారిపోతున్నారు.



బంగ్లాదేశ్‌కు చేరేందుకు అడ్డుగా ఉన్న నాఫ్‌ నదిని దాటేందుకు తాత్కాలిక పడవలను ఆశ్రయించారు. అయితే, అవి మార్గం మధ్యలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఊచకోతలపై దేశ వ్యాప్తంగా పుకార్లు చెలరేగడంతో అశాంతి నెలకొంది. రఖైన్‌ రాష్ట్రం జాతి, మతపరంగా చీలిపోయింది. ఊచకోతలో మరణించిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందని, మిలటరీ దళాలు తక్కువ మంది మరణించినట్లు లెక్కలు చూపుతున్నాయని స్వచ్చంద సంస్ధలు ఆరోపిస్తున్నాయి.



జాతిని కూకటివేళ్లతో పెకలించేందుకే..

రోహింగ్యా జాతిని నశింపజేసేందుకు సైన్యం, బౌద్ధులు యత్నిస్తున్నారని స్వచ్చంద సంస్థల ఆరోపణ. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ కూడా మయన్మార్‌పై ఇదే ఆరోపణ చేశారు. బర్మాలో చెలరేగిన హింస కారణంగా ఇప్పటివరకూ 27 వేలకు పైగా రోహింగ్యా ముస్లింలు పారిపోయినట్లు ఐరాస ఓ ప్రకటనలో పేర్కొంది. మయన్మార్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా పెరుగుతోంది. పౌరుల ప్రాణాలను కాపాడాలని మయన్మార్‌ ప్రభుత్వాన్ని అమెరికా కోరింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top