కరోనా వైరస్‌ అయితే.. తేనె, విస్కీతో మాయం!

British Man Says To Defeats Corona Virus With Whiskey and Honey - Sakshi

బీజింగ్‌: చైనాలో బయటపడ్డ కరోనా వైరస్‌ రోజు రోజుకూ ఖండాలు దాటుతోంది. దీని దెబ్బకు చైనాలోని ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే ఈ ప్రాణాంతక మహామ్మారిని తేనె, మద్యంతో అరికట్టవచ్చని ఓ బ్రిటీష్‌ ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. వివరాలు.. బ్రిటన్‌కు చెందిన కానర్‌ రీడ్‌ అనే వ్యక్తి చైనాలోని వుహాన్‌లో ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ గురించి మాట్లాడుతూ.. ‘రెండు నెలల క్రితం నేను తీవ్రమైన దగ్గు, జలుబుతో కూడిన ఫ్లూ, న్యుమోనియాతో బాధపడ్డాను.  చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా నా శరీరంలో చిన్న క్రిమి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. రెండు వారాలు పాటు ఆసుపత్రిలో ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇక నాకు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండటంతో బ్రీత్‌ అనలైజర్‌ కూడా పెట్టుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే డాక్టర్లు సూచించిన ఆంటీ బయాటిక్‌ మందులను సున్నితంగా తిరస్కరించానని.. సొంత వైద్యానికే మొగ్గు చూపానని తెలిపాడు.

వ్యాధి నివారణలో భాగంగా.. ఒక గ్లాసు వెచ్చని విస్కీలో తేనె కలుపుకుని తాగే వాడినని, ఇలా క్రమంగా తీసుకోవడంతో తన ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని.. తనలో ఉన్న ఆ వైరస్‌కూడా చనిపోయిందని పేర్కొన్నాడు. ఇక తాను పూర్తిగా కోలుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నాడు. ఇలా విస్కీతో తాను ఆ వైరస్‌ను జయించానని పేర్కొన్నాడు. కాగా తనకు వచ్చి ఆ వ్యాధి లక్షణాలు, కరోనా వైరస్‌ లక్షణాల ఒకేలా ఉన్నాయని, ఒకవేళ నాకు సోకింది కరోనా వైరస్‌ అయ్యుంటే  ఇలా విస్కీ, తేనెతో ఆరికట్టవచ్చు అని చెప్పుకొచ్చాడు.

కాగా, మూడేళ్లుగా చైనాలో ఉంటున్నానని తెలిపిన కానర్‌.. ఎప్పుడూ జనసంద్రంగా ఉండే వుహాన్‌ కరోనా వల్ల ఒక్కసారిగా దెయ్యాల నగరంగా మారిందన్నాడు. ఇక్కడి ప్రజలు బయట కాలు పెట్టడానికే జంకుతున్నారని, ఇక ముసుగు లేకుండా బయటకు వస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలిపాడు. ఈ కరోనా వైరస్‌ వల్ల చైనాలో ఇప్పటికే 490కి పైగా మంది మృతి చెందగా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా కరోనా వైరస్‌ కేసులు నమోదు అయినట్లు సమాచారం. (చైనా వెళ్లినవారి వీసాలను రద్దు చేసిన భారత్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top