10,000 ఏళ్ల భారీ గడియారం

Biggest Clock on the Earth - Sakshi

పశ్చిమ టెక్సాస్‌లోని

కొండల్లో నిర్మాణం

మానవాళిని హెచ్చరించేందుకే అంటున్న బిజోస్‌

వాషింగ్టన్‌ : ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బిజోస్‌ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలోని పశ్చిమ టెక్సాస్‌ పర్వతాల్లో 10,000 సంవత్సరాల వరకూ పనిచేసే భారీ గడియారాన్ని(క్లాక్‌ఆఫ్‌ లాంగ్‌ నౌ) రూపొందిస్తున్నట్లు బిజోస్‌ తెలిపారు. దాదాపు 500 అడుగులు ఎత్తుండే ఈ గడియారానికి భూమి థర్మో సైకిల్స్‌ ఆధారంగా శక్తి చేకూరుతుందని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టుపై గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నామనీ, ప్రస్తుతం టెక్సాస్‌ కొండల్లో ఈ గడియారాన్ని అమర్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని పేర్కొన్నారు. ‘ఇది ప్రత్యేకమైన గడియారం. దీర్ఘకాలిక ఆలోచనకు గుర్తుగా, చిహ్నంగా దీన్ని రూపొందిస్తున్నాం’అని బిజోస్‌ తెలిపారు. ఈ గడియారం నిర్మాణానికి సంబంధించి ఓ వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  

ప్రత్యేకత ఏంటి
అమెరికాకు చెందిన డ్యాని హిల్లీస్‌ 1989లో భారీ గడియారాన్ని నిర్మించాలన్న ఆలోచన చేశారు. జెఫ్‌ బిజోస్‌ చేరికతో భారీ గడియారం ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చింది. అమెరికాలోని టెక్సాస్‌ కొండల్లో రూ.272.20 కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ గడియారంలో సమయాన్ని అత్యంత కచ్చితత్వంతో లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం సూర్యకాంతి సాయంతో ఈ గడియారం తన సమయాన్ని సరిచేసుకుంటుంది. ఈ గడియారం సమయాన్ని గ్రెగొరియన్‌ పద్ధతిలో, ఐదు అంకెల రూపంలో తెలుపుతుంది. అంటే 2018ని ఈ గడియారం 02018గా సూచిస్తుంది.

ఇందులోని ఓ ముల్లు ఏడాదికోసారి మాత్రమే కదిలితే.. మరో ముల్లు ప్రతి వందేళ్లకోసారి మాత్రమే ముందుకెళ్తుంది. ప్రతి 1,000 ఏళ్లకు ఓసారి కూకూ(పక్షిలాంటి నిర్మాణం) బయటికొచ్చేలా ఈ గడియారంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అత్యంత కచ్చితత్వంతో పనిచేసేలా రూపొందించడంతో ప్రతి 20 వేల ఏళ్లలో ఒకరోజు మాత్రమే తేడా వస్తుంది. ఈ భారీ గడియారానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. వచ్చే 10,000 సంవత్సరాల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం ఈ గడియారంలో గంట మోగుతుంది. అయితే ఓసారి మోగిన గంట స్వరం వచ్చే 10 వేల ఏళ్లలో ఎన్నడూ పునరుక్తి కాకుండా దీని రూపకర్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎందుకు రూపొందిస్తున్నారు
గ్లోబల్‌ వార్మింగ్, సహజవనరుల విచ్చలవిడి వాడకంతో భవిష్యత్‌ తరాలపై మనవల్ల కలిగే దుష్పరిణామాలపై హెచ్చరించేందుకు, మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేందు వీలుగా ఈ గడియారాన్ని బిజోస్‌ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా నాగరికతలు 10,000 ఏళ్లలోపే అంతమైన నేపథ్యంలో ఈ గడియారంలో జీవితకాలాన్ని 10 వేల ఏళ్లుగా నిర్ణయించారు. అయితే టెక్సాస్‌లోని ఈ భారీ గడియారం దగ్గరకు చేరుకోవాలంటే మాత్రం అంత సులభమైన విషయం కాదు.

ఎందుకంటే సమీపంలోని విమానాశ్రయం నుంచి ఇక్కడకు చేరుకోవాలంటే కొన్ని గంటల పాటు కారులో ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకున్నాక దాదాపు రెండు వేల అడుగులు కొండపైకి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. చివరికి భారీ స్టీల్‌ తలుపులు దాటుకుని వెళ్తే ఈ భారీ గడియారాన్ని చూడొచ్చు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top