కునుకులేని అమెరికా

Approximately 70000 Coronavirus Cases Recording In America Per A Day - Sakshi

కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకొని అగ్రరాజ్యం విలవిల

వైరస్‌తో అతలాకుతలమవుతున్న దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు

రోజుకి 70 వేలకు పైగా కేసులు నమోదు

మేలో అంతా బాగానే ఉందనుకున్నారు. ఆంక్షలు సడలించారు, మార్కెట్లు బార్లా తెరిచేశారు. కంటికి కనిపించని శత్రువుపై విజయం సాధించామంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ జూన్‌లో సగర్వంగా ప్రకటించారు. సెకండ్‌ వేవ్‌ ప్రశ్నే లేదంటూ ధీమాగా చెప్పారు. పదిహేను రోజులు గడిచాయో లేదో కరోనా కేసులు రెట్టింపు వేగంతో పెరిగిపోయాయి. దక్షిణ, పశ్చిమాది రాష్ట్రాలు కొత్త హాట్‌స్పాట్‌లుగా మారాయి. 39 లక్షల 19 వేల కేసులు, లక్షా 43 వేల మృతులతో అమెరికా నిద్రలేని దేశంగా మారింది. 

వాషింగ్టన్‌ : ఒకప్పుడు రోజుకి 20 వేల కరోనా కేసులు నమోదైతేనే అందరూ హడలెత్తిపోయారు. కోవిడ్‌ ధాటికి అంతటి అగ్రరాజ్యం విలవిలలాడిపోయింది. అలాంటిది కళ్ల ముందే ప్రతీ వారం కొత్త రికార్డులు బద్దలవుతున్నాయి. రోజుకి 30 వేలు, 40 వేలు, 50 వేలు అలా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ప్రతీరోజూ 60 నుంచి 70వేల కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చేసింది. యూరప్‌లో నమోదవుతున్న కేసుల కంటే అయిదు రెట్లు ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల వెన్నులో కరోనా వణుకు పుట్టిస్తోంది. 50 రాష్టాలకుగాను 40 రాష్ట్రాలు డేంజర్‌ జోన్‌లో ఉన్నాయి. గత రెండు వారాల్లోనే కేసుల్లో 50% పెరుగుదల కనిపిస్తే, మరణాల రేటు 46% పెరిగింది. 

కొత్త హాట్‌స్పాట్‌లు 
ఏప్రిల్, మే నెలల్లో న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తే ఇప్పుడు అరిజోనా, ఫ్లోరిడా, టెక్సాస్, జార్జియా, అలబామా, లూసియానా వంటి రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఈ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలకు వైరస్‌ పాకింది. అరిజోనాలో వారం రోజుల్లోనే 27% కేసులు పెరిగాయి. ఫ్లోరిడా, సౌత్‌ కరోలినాలో 19% పెరుగుదల కనిపిస్తోంది. టెక్సాస్‌లో 18%, జార్జియాలో 17% పెరుగుదల కనిపిస్తోంది. అప్పుడూ, ఇప్పుడూ కూడా కాలిఫోర్నియాను కరోనా కకావికలం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఏకంగా 27% కేసులు పెరుగుతున్నాయి. టెక్సాస్‌లో రెండు వారాల లాక్‌డౌన్‌ విధించారు. కాలిఫోర్నియాలో రెస్టారెంట్లు, బార్లు, చర్చిలు మూసివేశారు.  లూసియానా, అలబామా, మోంటానాలో ఇల్లు దాటి బయటకు వస్తే మాస్క్‌ తప్పనిసరి చేశారు. అరిజోనా, టెక్సాస్, ఫ్లోరిడాలలో మరణాల రేటు అత్యధికంగా ఉంది. 

ఎందుకీ పెరుగుదల? 
దేశ ఆర్థిక వ్యవస్థా? ప్రజారోగ్యమా? దేనికి ప్రాధాన్యతనివ్వాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆర్థికానికే ప్రాధాన్యమని కుండబద్దలు కొట్టేశారు. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మార్కెట్లన్నీ ఆదరాబాదరాగా తెరిచేశారు.
కరోనాని కట్టడి చేయడంలో ముఖ్యపాత్ర పోషించే మాస్కుల చుట్టూ రాజకీయాలు నడిచాయి. డెమొక్రాట్‌ పార్టీకి చెందిన సెనేటర్‌ లామర్‌ అలెగ్జాండర్‌ మీరు ట్రంప్‌కి అనుకూలమైతే మాస్కులు వేసుకోకండి, వ్యతిరేకమైతే మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అమెరికన్లలో అత్యధికులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం అంటే తమ స్వేచ్ఛ హరించినట్టేనన్న భావనలో ఉన్నారు.
కేసులు ఎక్కువైతే హెర్డ్‌ ఇమ్యూనిటీ పెరుగుతుందని ప్రజలు విశ్వసించారు. ప్రపంచంలో అతి పెద్దదైన వరల్డ్‌ డిస్నీ పార్క్, బీచ్‌లు, క్లబ్బుల్లో జన ప్రవాహమే కనిపించింది. 
అధ్యక్ష ఎన్నికల ప్రచారం, నిధుల సేకరణతో రాజకీయపరమైన కార్యకలాపాలు జోరందుకున్నాయి. 
జాతి వివక్ష వ్యతిరేక ప్రదర్శనల్లో కూడా ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం అగ్రరాజ్యం కొంప ముంచాయి. 

ఇక రోజుకి లక్ష కేసులు?
అమెరికాలో కేసుల పెరుగుదల చూస్తుంటే రోజుకి లక్ష కేసులు నమోదయ్యే రోజు ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది. రానున్న శీతాకాలంలో అమెరికాలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించడానికే భయంగా ఉందని డైరెక్టర్‌ ఆఫ్‌ ది సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) డాక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాని కట్టడి చేయడంలో అమెరికా చాలా తప్పుదారిలో నడుస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజలు తమ తీరు మార్చుకోకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాలని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ నిపుణుడు ఆంటోని ఫాసీ హెచ్చరించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top