అమెరికాలో ‘మధ్యంతర’ పోలింగ్‌

Americans start voting in mid-term verdict on Trump rule - Sakshi

పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీగా గుమిగూడిన ఓటర్లు

డెమొక్రాట్లదే విజయమంటున్న సీఎన్‌ఎన్‌ సర్వే  

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభమైంది. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లో 35 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఈ ఎన్నికల్లో 36 రాష్ట్రాలకు గవర్నర్లను ప్రజలు ఎన్నుకోనున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌ రెండేళ్ల పాలనకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో విజయం అధికార రిపబ్లికన్లకు, ప్రతిపక్ష డెమొక్రాట్లకు కీలకంగా మారింది.

అమెరికాలోని తూర్పు రాష్ట్రాలైన మెయిన్, న్యూహాంప్‌షైర్, న్యూజెర్సీ, న్యూయార్క్‌లో మంగళవారం ఉదయం 6 గంటలకు(స్థానిక కాలమానం) పోలింగ్‌ మొదలైంది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు భారీగా చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ(దిగువ సభ)లో 435 స్థానాల్లో రిపబ్లికన్‌ పార్టీకి 235 మంది సభ్యులు ఉండగా, డెమొక్రటిక్‌ పార్టీకి 193 మంది సభ్యులు ఉన్నారు.

అలాగే ఎగువ సభ సెనేట్‌లోని 100 స్థానాల్లో రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు 52 మంది, డెమొక్రాట్లు 48 మంది ఉన్నారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో సోమవారం క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎప్పుడూ చప్పగా సాగే మధ్యంతర ఎన్నికలు తన కారణంగానే హాట్‌హాట్‌గా సాగుతున్నాయని కితాబిచ్చుకున్నారు.

నకిలీ ఖాతాలపై ఫేస్‌బుక్‌ కొరడా..
మధ్యంతరం సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించిన 115 అకౌంట్లను సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తొలగించింది. అమెరికా విచారణ సంస్థల ఫిర్యాదు నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో 30 ఖాతాలతో పాటు అనుబంధ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో 85 అకౌంట్లను బ్లాక్‌ చేసింది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు రష్యా యత్నించిందని విచారణ సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే.   

సీఎన్‌ఎన్‌ సర్వేలో డెమొక్రాట్లకు పట్టం..
ఈ ఎన్నికల్లో డెమొక్రట్లు విజయం సాధించనున్నట్లు సీఎన్‌ఎన్‌ సర్వేలో తేలింది. ఈ సర్వే  ప్రకారం.. ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు గాను డెమొక్రటిక్‌ పార్టీ 182 నుంచి 239 స్థానాలను(42–55 శాతం) కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. 2006, 2010 మధ్యంతర ఎన్నికల తరహాలో ఈసారీ రిపబ్లికన్లతో పోల్చుకుంటే డెమొక్రటిక్‌ పార్టీ 10 శాతం ఆధిక్యం పొందే అవకాశముంది. నల్ల జాతీయులు, లాటినో సంతతి ప్రజలు, చదువుకున్న శ్వేతజాతి మహిళలు, గృహిణులు డెమొక్రాట్లకు మద్దతుగా నిలిస్తే, శ్వేతజాతి పురుషులు ఎక్కువగా ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నట్లు సీఎన్‌ఎన్‌ సర్వేలో తేలింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top