వాన్నాక్రై.. పక్కా కిమ్‌ పనే!

America Alleges North Korea behind WannaCry ransomware attack - Sakshi

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికా మరో సంచలన ఆరోపణకు దిగింది. ప్రపంచాన్ని కుదిపేసిన వాన్నక్రై ర్యాన్సమ్‌వేర్‌ వెనుక ఉత్తర కొరియా హస్తం ఉందని చెబుతోంది. గతంలో పరోక్షంగా సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసినప్పటికీ.. ఈసారి మాత్రం అందుకు బలమైన సాక్ష్యాలే ఉన్నాయని ప్రకటించింది. ఈ మేరకు ట్రంప్‌ భద్రతా సలహాదారు టామ్‌ బాసొర్టే వ్యాఖ్యలను ఊటంకిస్తూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. 

ఉత్తర కొరియాకు చెందిన లాజారస్‌ సంస్థ ద్వారానే  ఈ సైబర్‌ దాడి జరిగింది. దాడి వెనుక సూత్రధారుల వివరాలను దర్యాప్తులో కనుగొన్నాం. ఈ విషయంలో మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడితేనే బావుంటుంది అని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ‘‘గత దశాబ్దంగా ఉత్తర కొరియా వైఖరి ఏ మాత్రం బాగోలేదు. కవ్వింపు చర్యలతో తోటి దేశాలను ఉల్లంఘిస్తోంది. అంతేకాదు అణు పరీక్షలతో అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికలు జారీ చేస్తోంది. అందులో భాగంగానే వాన్నాక్రై దాడికి పూనుకుంది. ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు బలమైన ఆధారాలు అమెరికా సంపాదించింది’’ అని ఆయన తెలిపారు. 

కాగా, 2014లో సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన కీలక డేటాను, కార్పొరేట్‌ సమాచారాన్ని నాశనం చేసినట్లు లాజారస్‌ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం వైట్‌హౌస్‌ నుంచి ఈ ఆరోపణలపై మరింత స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కిమ్‌ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన లేకపోవటం విశేషం. 

ర్యాన్సమ్‌వేర్‌ అనేది మాల్‌ వేర్లలో ఒకరకం. ర్యాన్సమ్‌ అంటే డబ్బులిచ్చి చెరనుంచి విడిపించుకోవడం.  అమెరికా జాతీయ భద్రతా సంస్థ అభివృద్ధి చేసిన ఓ హ్యాకింగ్‌ టూల్‌ను తస్కరించిన సైబర్‌ దొంగలు దాని సహాయంతో ఈ 'వాన్నాక్రై' ర్యాన్సమ్‌ వేర్‌ వైరస్‌ను రూపొందించారు. మొట్టమొదటగా ఈ ర్యాన్‌సమ్‌వేర్‌ సైబర్‌ దాడి స్వీడన్‌లో వెలుగులోకి వచ్చింది. తర్వాత బ్రిటన్‌, ఫ్రాన్స్‌లకు పాకింది. 'వాన్నాక్రై' అనే ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌ దాడితో ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రభుత్వ, ప్రయివేటు కంప్యూటర్లు స్థంబించిపోయాయి. ఇంతకీ ఈ వాన్నాక్రై అసలు పేరు వాన్నా క్రిప్ట్‌.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top