breaking news
WannaCry ransomware
-
వాన్నాక్రై.. పక్కా కిమ్ పనే!
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా మరో సంచలన ఆరోపణకు దిగింది. ప్రపంచాన్ని కుదిపేసిన వాన్నక్రై ర్యాన్సమ్వేర్ వెనుక ఉత్తర కొరియా హస్తం ఉందని చెబుతోంది. గతంలో పరోక్షంగా సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసినప్పటికీ.. ఈసారి మాత్రం అందుకు బలమైన సాక్ష్యాలే ఉన్నాయని ప్రకటించింది. ఈ మేరకు ట్రంప్ భద్రతా సలహాదారు టామ్ బాసొర్టే వ్యాఖ్యలను ఊటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఉత్తర కొరియాకు చెందిన లాజారస్ సంస్థ ద్వారానే ఈ సైబర్ దాడి జరిగింది. దాడి వెనుక సూత్రధారుల వివరాలను దర్యాప్తులో కనుగొన్నాం. ఈ విషయంలో మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడితేనే బావుంటుంది అని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ‘‘గత దశాబ్దంగా ఉత్తర కొరియా వైఖరి ఏ మాత్రం బాగోలేదు. కవ్వింపు చర్యలతో తోటి దేశాలను ఉల్లంఘిస్తోంది. అంతేకాదు అణు పరీక్షలతో అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికలు జారీ చేస్తోంది. అందులో భాగంగానే వాన్నాక్రై దాడికి పూనుకుంది. ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు బలమైన ఆధారాలు అమెరికా సంపాదించింది’’ అని ఆయన తెలిపారు. కాగా, 2014లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన కీలక డేటాను, కార్పొరేట్ సమాచారాన్ని నాశనం చేసినట్లు లాజారస్ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం వైట్‌హౌస్ నుంచి ఈ ఆరోపణలపై మరింత స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కిమ్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన లేకపోవటం విశేషం. ర్యాన్సమ్వేర్ అనేది మాల్ వేర్లలో ఒకరకం. ర్యాన్సమ్ అంటే డబ్బులిచ్చి చెరనుంచి విడిపించుకోవడం. అమెరికా జాతీయ భద్రతా సంస్థ అభివృద్ధి చేసిన ఓ హ్యాకింగ్ టూల్‌ను తస్కరించిన సైబర్ దొంగలు దాని సహాయంతో ఈ 'వాన్నాక్రై' ర్యాన్సమ్ వేర్ వైరస్‌ను రూపొందించారు. మొట్టమొదటగా ఈ ర్యాన్సమ్వేర్ సైబర్ దాడి స్వీడన్లో వెలుగులోకి వచ్చింది. తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్‌లకు పాకింది. 'వాన్నాక్రై' అనే ర్యాన్సమ్వేర్ వైరస్ దాడితో ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రభుత్వ, ప్రయివేటు కంప్యూటర్లు స్థంబించిపోయాయి. ఇంతకీ ఈ వాన్నాక్రై అసలు పేరు వాన్నా క్రిప్ట్. -
అడల్‌కజ్‌తో మరో సైబర్ ముప్పు?
సాక్షి, హైదరాబాద్: సైబర్ ప్రపంచంపై మరో దాడికి రంగం సిద్ధమైందా.. వాన్నక్రై ర్యాన్సమ్ వేర్ తాకిడి నుంచి కోలుకోకముందే హ్యాకర్లు అడల్‌కజ్ పేరుతో మరో మాల్వేర్తో దాడి చేయనున్నారా.. వాన్నక్రై కంటే తీవ్రమైన నష్టాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుందా..అంటే అవునంటోంది ప్రూఫ్ పాయింట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ. కంప్యూటర్లలోని ఫైళ్లన్నింటినీ కోడ్ భాషలోకి మార్చేసి సరిచేసేందుకు బిట్‌కాయిన్ కరెన్సీ ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం వాన్నక్రై ర్యాన్సమ్వేర్ తీరైతే.. అడల్‌కజ్ ఇలాంటివేవీ చేయదు. కానీ.. మీ కంప్యూటర్ల వేగాన్ని గణనీయంగా తగ్గించేస్తుంది. అదే సమయంలో ఇతర కంప్యూటర్లకు విస్తరిస్తూ... వర్చువల్ ప్రపంచపు బిట్‌కాయిన్ తరహా కరెన్సీ ‘మనెరో’కోసం వెతుకుతూంటుంది. అందిన మొత్తాన్ని వైరస్‌ను సృష్టించిన వారి అకౌంట్లలోకి జమచేస్తుంది. మాల్వేర్ల ద్వారా వర్చువల్ కరెన్సీని వెతకడం కొత్త కాకపోయినప్పటికీ ఇటీవలి కాలంలో భారీ ఎత్తున డబ్బు హ్యాకర్ల ఖాతాల్లోకి చేరుతున్నట్లు ప్రూఫ్‌పాయింట్ ఉపాధ్యక్షుడు రాబర్ట్ హోమ్స్ తెలిపారు. ఈ మాల్వేర్ రహస్యంగా పనిచేస్తూండటం వల్ల ఇది ఎప్పుడు, ఎలా విస్తరిస్తోందో మనెరో కరెన్సీ ఎంత సేకరిస్తోందో తెలియడం లేదని హోమ్స్ అంటున్నారు. బహుశా ఈ నెల 2న లేదంటే అంతకంటే ముందు ఏప్రిల్ 24 నుంచే ఇది వ్యాప్తి చెందుతూ ఉండవచ్చునని ప్రూఫ్‌పాయింట్ అంచనా వేస్తోంది.