
వాషింగ్టన్: నేటి డిజిటల్ యుగంలో పౌరుల గోప్యతా పరిరక్షణకు భారత్ సరైన దిశలోనే సాగుతోందని ఆధార్ రూపకర్త నందన్ నిలేకని అన్నారు. ఆధార్ పథకం గోప్యత పరీక్షను విజయవంతంగా అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా శుక్రవారం వాషింగ్టన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నీలేకని ప్రసంగించారు.
‘గోప్యతకు సంబంధించి భారత్‌లో అన్ని అనుకూల పరిస్థితులే ఉన్నాయి. ఆధార్ గోప్యతను ఉల్లంఘిస్తోందంటూ చాలా మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో భారత్‌లో గోప్యత ప్రాథమిక హక్కుల్లో భాగమా? అనే ప్రశ్న తలెత్తింది. ఆ తరువాత 9 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. గోప్యత ప్రాథమిక హక్కుల్లో భాగమని కోర్టు తీర్పు చెప్పింది. చట్టం, హేతుబద్ధత, సమానత్వం ప్రాతిపదికన ఆ హక్కుకు పరిమితులు విధించొచ్చని కూడా తెలిపింది’ అని నీలేకని వివరించారు.
సామాజికాభివృద్ధి, సృజనకు డిజిటల్ సాంకేతికత ముఖ్యమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ జరిపే విచారణలో ఆధార్ గట్టెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత లేమి కారణంగా ఎవరికీ ప్రభుత్వ ప్రయోజనాలు దూరం కాకుడదని నీలేకని అన్నారు. అదే సమయంలో టెక్నాలజీ సంక్షేమ కార్యక్రమాల్లో అడ్డంకి కాకూడదని అభిప్రాయపడ్డారు.