న్యూజిలాండ్‌తో సహా 9 దేశాల్లో జీరో కేసులు

9 Countries Including New Zealand Are Now Covid 19 Free - Sakshi

వెల్లింగ్టన్‌: కరోనాతో ప్రంపచ దేశాలన్ని కకావికలమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 70 లక్షలు దాటగా.. 4 లక్షల మరణాలు సంభవించాయి. మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఓ శుభవార్త ఏంటంటే.. న్యూజిలాండ్‌తో సహా 9 దేశాలు కరోనా ఫ్రీ అని ప్రకటించుకున్నాయి. ప్రస్తుతం అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావడం లేదు. ఆ దేశాల వివరాలు..

1. న్యూజిలాండ్‌
జూన్‌ 8న తమ దేశంలోని చివరి కరోనా రోగి కోలుకున్నట్లు న్యూజిలాండ్‌ వైద్యాధికారులు తెలిపారు. పసిఫిక్ ద్వీప దేశం కేవలం 1500 కరోనా కేసులు గుర్తించగా.. వీరిలో 22 మంది మరణించారు.

2. టాంజానియా
దేవుని శక్తులు తమ దేశం నుంచి కరోనాను తొలగించాయని అధ్యక్షుడు జాన్ మాగుఫులి ఆదివారం చర్చి సేవలో ప్రకటించారు. ఈ ఆఫ్రికన్ దేశంలో నమోదైన కేసుల సంఖ్యను బహిరంగంగా వెల్లడించడం ఆపేసిన ఆరు వారాల తరువాత అధ్యక్షుడు ఈ ప్రకటన చేశాడు. టాంజానియాలో కోవిడ్‌ -19 కేసుల సంఖ్య 509 వద్ద ఆగిపోయింది. 

3. వాటికన్‌
12 మంది కోలుకున్న తర్వాత తమ దేశం కరోనా రహితంగా మారిందని జూన్‌ 6న వాటికన్‌ సిటి ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక్క మరణం కూడా సంభవించలేదని తెలిపింది. 12 మందిలో చివరి వ్యక్తికి కరోని నెగిటివ్‌గా వచ్చినట్లు దేశ అధికార ప్రతినిధి మాటియో బ్రూని ఒక ప్రకటన విడుదల చేశారు.

4. ఫిజి
మొత్తం 18మంది కోలుకున్న తర్వాత తమ దేశం కరోనా ఫ్రీగా మారిందని దేశ అధ్యక్షుడు ప్రధాని ఫ్రాంక్ బైనీమరామ శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ‘రోజు టెస్టుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ గడిచిన 45 రోజులుగా ఒక కేసు కూడా నమోదు కాలేదు. ఒక్క మరణం సంభవించలేదు. 100శాతం అందరు కోలుకున్నారు’ అని ట్వీట్‌ చేశారు. 9 లక్షల జనాభా ఉన్న ఫిజిలో ఏప్రిల్‌ నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయడమే కాక సరిహద్దు ఆంక్షలు విధించారు.

5.మాంటినిగ్రో
మొదటి కరోనా కేసు గుర్తించిన 69 రోజుల తర్వాత ప్రస్తుతం తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని మాంటినిగ్రో ప్రకటించింది. ఈ దేశంలో 324 కేసులు నమోదు కాగా 9 మంది మరణించారు.

6. సిషెల్స్‌
మే 18 నాటికి కరోనా ఫ్రీగా మారినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక్కడ 11 కేసులు నమోదు కాగా.. ఒక్కరు కూడా మరణించలేదు.

7. సెయింట్ కిట్స్, నెవిస్
మే 19 న ఈ కరిబియన్‌ దీవులు కరోనా వైరస్ రహితంగా మారాయి. మొత్తం 15 మంది కోవిడ్ -19 రోగులు కోలుకున్నట్లు తెలిపాయి. అన్ని కేసులకు ప్రయాణ చరిత్ర ఉందని ప్రభుత్వం ప్రకటించింది.

8. టిమోర్-లెస్టె
మొత్తం 24 మంది కోలుకున్న తర్వాత మే 15న టిమోర్-లెస్టె తనను తాను కోవిడ్‌-19 రహిత దేశంగా ప్రకటించుకుంది. మరణాల గురించి తెలపలేదు.

9. పాపువా న్యూ గినీ
ఈ‌ దేశం మే 4న కరోనా రహిత దేశంగా ప్రకటించుకుంది. ఇక్కడ 24 కేసులు నమోదుకాగా అందరు కోలుకున్నారు. మరణాలు సంభవించలేదు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top