ప్రపంచానికి దూరంగా 45 ఏళ్లు....

ప్రపంచానికి దూరంగా 45 ఏళ్లు....


పారిస్: మానవ ప్రపంచానికి దూరంగా ఎక్కడో కొండ కోనల్లో ప్రజలంతా ఖాళీ చేసిన ఓ కుగ్రామంలో భార్యా భర్తలు ఇద్దరు మాత్రమే ఉండాలనుకోవడం ఓ అందమైన ఊహ. ప్రాక్టికల్‌గా కొన్ని రోజులో, కొన్ని నెలలో ఉండొచ్చు. ఏళ్ల తరబడి అలాగే జీవించాలంటే పిచ్చెక్కడం ఖాయమనిపిస్తుంది.  కానీ స్పెయిన్‌కు చెందిన భార్యాభర్తలు.. ఇద్దరే గత 45 సంవత్సరాలుగా అలాగే జీవిస్తున్నా వారికి పిచ్చెక్కలేదు సరికదా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ముదిమి వయస్సులో కూడా ఒకరికొకరు తోడు నీడగా, కుక్కలు, పిల్లులే బంధు మిత్రులుగా బతుకుతున్నారు.79 ఏళ్ల జ్వాన్ మార్టిన్, 82 ఏళ్ల సిన్‌ఫొరోస కలోమర్‌లు పడుచు ప్రాయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పండంటి కొడుకు కూడా పుట్టాడు. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే అనారోగ్యంతో కొడుకు లోకంవీడి వెళ్లి పోయాడు. 1936లో స్పెయిన్‌లో అంతర్యుద్ధం రగులుకుంది. బతుకు తెరువు కోసం పల్లెలనుంచి వేలాది మంది ప్రజలు పట్నాలకు వలసపోయారు. అలాగే, వాలెన్సియా పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలోవున్న లా ఎస్ట్రెల్లా గ్రామం కూడా ఖాళీ అయింది.200 మంది ఊరు విడిచారు. మార్టిన్, కలోమర్‌లు మాత్రమే మిగిలిపోయారు. మార్టిన్ కూడా వెళ్లి పోదామనుకున్నాడు. కానీ భార్య కలోమర్ ఒప్పుకోలేదు. పుట్టి పెరిగిన గ్రామాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంది. దాంతో, ప్రేమించిన భార్యను వీడలేక ఆమెతోపాటే మార్టిన్ ఉండిపోయాడు. సాధ్యమైనంత మేరకు వ్యవసాయం చేసుకుంటూ, కూరగాయలు పండించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఊరిలో మిగిలిపోయిన కుక్కలు, పిల్లులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారు గడిచిన జీవితంలో ఏనాడు పోట్లాడుకోలేదట. అప్పుడప్పుడు విసుక్కున్నా దాన్ని ఛలోక్తులతో హాస్యంగా మార్చుకున్నారట. ప్రపంచం కూడా వీరిద్దరి సంగతి మర్చిపోయింది.స్పెయిన్‌కు చెందిన ఔత్సాహిక నవతరం దర్శకులు బిల్లి సిల్వా, గిల్లీ ఇసాలకు ఈ దంపతుల గురించి ఎలాగో తెల్సింది. వారు వెంటనే లా ఎస్ట్రెల్లా గ్రామానికి వెళ్లి దంపతుల జీవనశైలి, మనోభావాలపై ఓ షార్ట్ ఫిల్మ్ తీశారు. అది ‘ఎవొల్యూషన్ మల్లోర్కా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శనకు ఎంపికయింది. నవంబర్ 13వ తేదీన ప్రదర్శిస్తున్నారు. అనంతరం ఆన్‌లైన్‌లో వీక్షణకు అవకాశం ఇస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top