కన్నీటి విలువెంత?

Gollapudi Maruthi Rao Article On Families Of Martyred Jawans - Sakshi

జీవన కాలమ్‌ 

ఇవాళ పేపరు తెరవగానే ఒక ఫొటో నా దృష్టిని నిలిపేసింది. ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని షోపియన్‌ గ్రామంలో పాకిస్తాన్‌ దుండగులతో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఓ సైనికుడి సహచరుడు సోమవారం చెక్‌ అష్ముజీ అనే గ్రామంలో ఉంటున్న 75 సంవత్సరాలు పైబడిన ఆ మిత్రుడి తండ్రి దగ్గరికి వచ్చాడు. తన కళ్లముందే కన్నుమూసిన మిత్రుడి మరణాన్ని గురించి చెప్పాడు. దుఃఖంతో నీరుకారిపోయిన ఆ వృద్ధుడిని పొదివి పట్టుకున్న చిత్రమది. ఇది మానవత్వానికి ఆవలి గట్టు. దేశానికి సేవ చేస్తూ ప్రాణాలర్పించిన ‘నిశ్శబ్ద’ దేశభక్తుడు కొడుకు. ఆ వృద్ధుడి శరీరంలో ప్రతీ అణువూ కించిత్తు ‘గర్వం’తో పులకించి ఉంటుంది.

ఈ కథని చాలామంది విని ఉండవచ్చు. కానీ మరోసారి వింటే తప్పులేదు. యుద్ధరంగంలో శత్రువుతో పోరాడుతున్న ఇద్దరు మిత్రులు– రాముడు, రంగడు. రంగడు గాయపడ్డాడు. శత్రు స్థావరంలో ఉండిపోయాడు. రాముడు సాహసం చేసి ముందుకు వెళ్లి ప్రాణాలతో ఉన్న రంగడిని వెనక్కు తెచ్చాడు. తెస్తూండగా తాను గాయపడ్డాడు. రంగడి చేతుల్లో ప్రాణాలు వదులుతూ ‘తన మరణాన్ని స్వయంగా తన తల్లిదండ్రులకు తెలియజెయ్యమ’ని కోరి కన్నుమూశాడు. రంగడికి భయంకరమైన దుఃఖమది. తనని రక్షించి తన మిత్రుడు కన్నుమూశాడు.

అతని ఇంటికి వెళ్లడానికి ధైర్యం చాలలేదు. కొన్నాళ్లకి సాహసం చేశాడు– మిత్రుడికిచ్చిన మాట కోసం. తల్లిదండ్రులు వృద్ధులు. ముట్టుకుంటే కూలి పోయేటట్టు ఉన్నారు. ఇతడిని హార్దికంగా ఆహ్వానించారు. తల్లి ఆప్యాయంగా వండిపెట్టింది. వారి ఆదరణ చూసి నోరిప్పి కొడుకు మరణాన్ని తెలియజేయలేకపోయాడు. ఒక రోజు కాదు– పది రోజులు. చివరికి నిస్సహాయంగా తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు. ముసలివాళ్లు గుమ్మందాకా వచ్చారు. తన మిత్రుడికిచ్చిన మాట! చెప్పలేక చెప్పలేక వారి కొడుకు మరణాన్ని వెల్లడించాడు. తల్లిదండ్రులు ఓ క్షణం నిశ్శబ్దమయిపోయారు. తల్లి ఈ రంగడి బుగ్గలు నిమిరి ‘మాకు తెలుసు బాబూ. సమాచారం అందింది. కానీ ఈ పది రోజులూ ఆ విషయం గురించి కదిపి నిన్ను బాధపెడతామని ఎత్తలేదు’ అన్నది.

ఈ మధ్య రాజీవ్‌గాంధీ హత్యకు కారణమయినవారిని విడుదల చేయాలని.. ‘మానవీయమైన’ ఉదాత్తతని చూపే కొందరు మహానుభావులు వాపోతున్నారు. మంచిదే. కానీ తాము చేయని నేరానికి ఆయనతోపాటు ప్రాణాలు పోగొట్టుకున్న 15 మంది అజ్ఞాత వ్యక్తుల దయనీయమైన కథనాలు వీరికి తెలియవేమో.

రెండు నమూనాలు. 1991 మే 21. ధర్మన్‌ అతని పేరు. కాంచీపురంలో స్పెషల్‌ బ్రాంచి హెడ్‌ కానిస్టేబుల్‌. ఆయన పిల్లలు ఆ రాత్రి రెడ్‌ హిల్స్‌లో ఓ బంధువు ఇంట్లో సరదాగా వేసవి శెలవులు గడుపుతున్నారు. ఒక పోలీసు అర్ధరాత్రి వచ్చి– ఓ మారణకాండలో మీ నాన్న చనిపోయాడని చెప్పారు. అప్పుడు కొడుకు ఎనిమిదో క్లాసు చదువుతున్నాడు. చెల్లెలికి పదేళ్లు. మరో తమ్ముడికి 5. భార్యకి 23 ఏళ్లు.  ఈ కొడుకు రాజశేఖరన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ట్యాక్సీ నడుపుకుంటున్నాడు.

మరొక్క కథ. ఆమె పేరు సంతానీ బేగం. కాంగ్రెస్‌ మహిళా కార్యకర్త. ఈవిడ మారణహోమంలో చచ్చిపోయింది. అప్పుడు ఈవిడ కొడుకు రెండో క్లాసు చదువుతున్నాడు. తండ్రి చిన్నప్పుడే పోయాడు. వీళ్లన్నయ్య ఈ సభకి వెళ్లొద్దన్నాడు. ‘మా నాయకుడు. వెళ్లకపోతే ఎలా?’ అని తల్లి వెళ్లింది. కుర్రాడు అబ్బాస్‌ మాటలు: ‘మా అమ్మ పోయాక మేం వీధిన పడ్డాం. సంవత్సరాల తర్వాత నేను రాజీవ్‌గాంధీ కుటుంబానికి ఉత్తరం రాశాను. ఏమీకాలేదు’. ఇప్పుడు ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడు? సెల్‌ఫోన్ల సామాన్లు అమ్ముకుంటున్నాడు. ఇలాంటివి ఇంకా 13 కథలున్నాయి.

రాజకీయాల్లోకి రావడం మనస్కరించని 46 ఏళ్ల కుర్రాడిని–రాజీవ్‌గాంధీని– ఆనాడు నెహ్రూ కుటుం బం అయిన కారణానికి ప్రధానిని చేశారు. ఫలితం– ఒక అనర్థం. తర్వాత వారి సతీమణి అయిన కారణానికి ఒకావిడని అందలం ఎక్కించారు. ఆవిడ 58 వేల కోట్ల కుంభకోణాలతో, ఓటరు అసహ్యించుకోగా బయటికి నడిచారు. ఇప్పుడు బొత్తిగా బొడ్డూడని ఓ కుర్రాడు– కేవలం నెహ్రూ కుటుంబం అయిన కారణానికి ఆ పార్టీని వెలగబెడుతున్నాడు.

జమ్మూకశ్మీర్‌లో 75 ఏళ్ల వృద్ధుడి గర్భశోకం, ఆనాటి 12 ఏళ్ల కుర్రాడు పితృశోకం ఈ దేశపు వైభవానికి అజ్ఞాతమైన పెట్టుబడులు. కన్నీటిలో గాంభీర్యం ప్రపంచాన్ని జయిస్తుంది. వ్యక్తుల్ని వ్యవస్థలుగా మలిచి ఆకాశాన్ని నిలుపుతుంది. ఉదాత్తతకి దుఃఖం అనుపానం. వీరి స్థానం పత్రికల్లో మారుమూల కావచ్చు. కానీ ఏభై అంతస్థుల భవనంలో పునాదిలోని సిమెంట్‌ రాయికీ తనదైన పాత్ర ఉంది.

గొల్లపూడి మారుతీరావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top