గూగుల్‌ బడ్స్‌తో 40 భాషలు

40 languages with Google buds - Sakshi

భాషరాని చోటికి వెళితే ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. చేతిలో గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌.. ‘బడ్స్‌’ఇయర్‌ ఫోన్స్‌ ఉంటే చాలు.. దాదాపు 40 భాషలు మీకు వచ్చినట్లే.. ఎందుకంటే ఈ బడ్స్‌  40 భాషలను తర్జుమా చేసి వినిపిస్తాయి. ఇటీవల జరిగిన గూగుల్‌ పిక్సెల్‌ కార్యక్రమంలో భాగంగా ఈ బడ్స్‌ను విడుదల చేశారు. ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ మాదిరిగా ఇవి నేరుగా స్మార్ట్‌ఫోన్‌ లేదా టాబ్లెట్‌కు అనుసంధానమై ఉండవు. కానీ రెండు చెవుల్లో ఉంచుకునే ఫోన్స్‌ మాత్రం ఒక తీగతో కనెక్ట్‌ అయి ఉంటాయి.

అంతేకాకుండా కుడివైపు ఇయర్‌ఫోన్‌పై ఓ టచ్‌ప్యాడ్‌ ఉంటుంది. దీనిద్వారా మ్యూజిక్‌ను కంట్రోల్‌ చేయొచ్చు. పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఏ భాషనైనా ఇంకో భాషలోకి తర్జుమా చేసి వినిపిస్తాయి. అవతలి వ్యక్తి మాట్లాడుతూండగానే.. తర్జుమా చేసిన మాటలు మనకు వినిపించడం విశేషం. కుడిచెవిలోని వేళ్లతో టచ్‌ చేసి ఫలానా భాష మాట్లాడేందుకు సాయం చేయాలని అడగటమే ఆలస్యం గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ పనిలో పడిపోతుంది.

మీరు మాట్లాడే భాష తాలూకూ భాషను స్పీకర్‌ ద్వారా ఎదుటి వ్యక్తికి వినిపించొచ్చు. బడ్స్‌లో ఎలాగూ ‘గూగుల్‌ అసిస్టెంట్‌’ఉంటుంది కాబట్టి.. స్మార్ట్‌ఫోన్‌లోని మ్యూజిక్‌ను మన మాటలతోనే కంట్రోల్‌ చేయొచ్చు. ఫోన్‌కాల్స్, టెక్ట్స్‌ మెసేజీ చదివేందుకు కూడా స్మార్ట్‌ఫోన్‌ను బయటకు తీయాల్సిన అవసరం ఉండదన్నమాట!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top